కెసిఆర్ చివరి ప్రయత్నంగా రాజశ్యామల యాగం

నామినేషన్ల ఘట్టం పూర్తవుతున్న సమయంలో ఉదృతంగా పార్టీ ప్రచారంలోకి దిగవలసిన సమయంలో, రాజకీయ ఎత్తుగడలకు పదును పెట్టవలసిన అవసరం ఉండగా, టీఆర్ఎస్‌ అధినేత, ఆపధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాత్రం కుటుంభ సభ్యులతో కలసి రెండు రోజులపాటు రాజశ్యామల యాగం చేస్తూ గడపడం విస్మయం కలిగిస్తున్నది. తనకు ఎదురు లేదని, తమకు పోటీ ఇచ్చేవారే లేరనే భరోసాతో ముందస్తు ఎన్నికలకు దిగిన ఆయనకు వరుసగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ రావడం, అనుకున్న విధంగా మొదటి దశలో ఎన్నికలు జరుగకుండా చివరి దశకు మారడంతో ప్రతిపక్షాలకు సర్దుబాట్లు చేసుకొనే సయం లభించింది. దాంతో ఇప్పుడు ఆత్మరక్షణలో పడిన్నట్లు కనిపిస్తున్నారు.

మూఢనమ్మకాలను విశ్వసించడంలో అగ్రగన్యుడిగా పేరొందిన కెసిఆర్ చివరి ప్రయత్నంగా ఎన్నికలలో గెలుపు కోసం ఇప్పుడు ఈ యాగం చేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.  పూర్తిగా చేతులెత్తేయాల్సిన పరిస్థితి రావడంతో చివరి ప్రయత్నంగా ఫామ్ హౌస్‌లో యాగం చేస్తున్నారని చెప్పుకొంటున్నారు. ఎర్రవల్లి గ్రామ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆది, సోమ వారాల్లో ఆయన రాజశ్యామల యాగాన్ని చేపట్టారు. దివారం ప్రారంభమైన ఈ యాగంలో  సోమవారం ఉదయం 11.11 గంటలకు పూర్ణాహుతి నిర్వహిస్తారు. అదేరోజు ఏకరాత్రి దీక్షలు ఉంటాయి.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, రాష్ట్రాభివృద్ధి కోసం తలపెట్టిన కార్యాలు పరమేశ్వరుడి దయతో దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం తలపెట్టిన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఇందులో భాగంగా సూర్య నమస్కారాలు, మహాలింగార్చన, అన్ని గ్రహాలకు హోమాలు నిర్వహించారు. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 75 మంది రుత్వికులు పాల్గొన్నారు.

కేసీఆర్ ఆదేశం మేరకు ఆయన సన్నిహితులు ఇటీవల స్వరూపానంద జన్మదినోత్సవానికి వెళ్లి ఫామ్ హౌస్‌లో రాజ శ్యామల హోమం జరపాల్సిందిగా కోరారు. మరోవైపు ఇదే సమయంలో శృంగేరి ఆస్థాన పండితులు పనిషశంక శర్మ, గోపి కృష్ణ శర్మ ఆధ్వర్యంలో 72 మంది ఋత్విక్కులు మహారుద్ర సహిత చండీ యాగం నిర్వహించారు.

ఈ హవన కార్యక్రమాల పూర్ణాహుతి సోమవారం మధ్యాహ్నం పూర్తి కాగానే, కెసిఆర్ ఎన్నికల ప్రచార సభలకు బయలుదీరి వెడతారు. మధ్యాన్నం 2.30 గంటలకు ఖమ్మంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు.

ఈ సందర్భంగా ఫామ్ హౌస్ చుట్టూ భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఎవర్ని లోపలికి అనుమతించడం లేదు. ఈ ఎన్నికలలో గెలుపొందలేని పక్షంలో తన కుటుంభం సభ్యులు అందరి రాజకీయ భవిష్యత్ ప్రశ్నర్ధకరంగా మారుతుందనే ఆందోళనతో ఈ యాగం చేస్తున్నట్లు తెలుస్తున్నది. అందివచ్చిన అధికారాన్ని బలోపేతం చేసుకోవడమ కోసం 2015లో కేసీఆర్‌ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం వద్ద అయుత చండీయాగం నిర్వహించిన విషయం తెలిసిందే.