అనూహ్యంగా మిర్యాలగూడ నుండి ఆర్ కృష్ణయ్య

అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ చివరి క్షణంలో బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షు డు ఆర్‌. కృష్ణయ్యకు మిర్యాల గూడ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించింది. టీడీపీ ఎల్బీ నగర్‌ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే అయిన  కృష్ణయ్య ఆదివారం సాయంత్రం టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఆరుగురు సభ్యులతో ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనకు చోటు కల్పించింది.

కాంగ్రెస్‌తో కలసి పని చేసేందుకు సిద్ధమని కృష్ణయ్య గతంలోనే ప్రకటించినా అప్పట్లో అధికారికంగా కాంగ్రెస్‌లో చేరలేదు. పైగా గత ఎన్నికలలో టిడిపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎల్ బి నగర్ నుండి పోటీ చేసి అక్కడి నుండి గెలిచిన కృష్ణయ్య ఇప్పుడు కుడా అదే సీట్ కావాలని పట్టుబడుతూ వస్తున్నారు. అయితే అక్కడ కాంగ్రెస్ కు బలమైన నేత సుదీర్ రెడ్డి ఉండడంతో అందుకు కాంగ్రెస్ విముఖత వ్యక్తం చేస్తూ వచ్చింది.

ఒకవేళ తనకు టికెట్‌ ఇవ్వాలని అనుకుంటే ఎల్బీ నగర్‌ లేదా తాండూరులో ఏదో ఒక స్థానాన్ని కేటాయించాలని కృష్ణయ్య స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితాలో బిసిలకు తక్కువ స్థానాలు కేతాయిస్తున్నరన్న విమర్శలు పార్టీ వర్గాలలోనే చెలరేగుతున్నాయి. సగం సీట్లు బిసిలకు ఇవ్వాలని పట్టుబడుతూ కృష్ణయ్య సహితం కాంగ్రెస్ నామమాత్రంగా సీట్లు కేటాయించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అందుకు నిరసనగా తెలంగాణ బంద్ కు కుడా ముందు పిలుపిచ్చి, తర్వాత వాయిదా వేసారు. అయితే ఆయనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కావడం విస్మయంకు గురిచేస్తున్నది. బిసిలలో కాంగ్రెస్ పట్ల నెలకొన్న అసంతృప్తిని తొలగించడం కోసం కృష్ణయ్యను పోటీకి దింపిన్నట్లు భావిస్తున్నారు.

మరో బిసి నేత, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌కు సికింద్రాబాద్‌ స్థానం కేటాయించారు. వాస్తవానికి మిర్యాలగూడ స్థానాన్ని తన కుమారుడుకు ఇవ్వాలని సీనియర్ నేత కె జానారెడ్డి పట్టుబడుతూ ఉండడంతో చివరి వరకు అభ్యర్ధిని నిర్ణయించలేదు. అయితే ఇదే స్థానానికి టీజేఎస్‌ కూడా విద్యాధర్‌రెడ్డికి బీ ఫారం ఇవ్వడంతో అందరు కలసి కృష్ణయ్యను ఏమి చేస్తారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.  

కాంగ్రెస్ ఒక్క సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తూ బిసిలను నిర్లక్ష్యం చేస్తున్నదని ఆ పార్టీకి చెందిన బిసి నేతలే ఢిల్లీ వరకు వెళ్లి నిరసనలు తెలిపారు. కాంగ్రెస్ కన్నా రెట్టింపుకు పైగా బిసి అభ్యర్ధులకు టీఆర్‌ఎస్, బిజెపి పార్టీలు సీట్లు ఇవ్వడం గమనార్హం. రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిన సీట్లలో బిసిలకు సగం కుడా ఇవ్వలేదు. దానితో బిసి వర్గాలలో చెలరేగుతున్న ఆగ్రహాన్ని కృష్ణయ్య ఏమాత్రం చల్లారుస్తారో చూడవలసి ఉంది.

ఇదివరలో బిజెపి తనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తే ఆ పార్టీలో చేరడానికి కృష్ణయ్య సంసిద్దతను వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తున్నది. అయితే అందుకు ముందుగా జాతీయ స్థాయిలో బిసి కమీషన్ చైర్మన్ పదవి వంటి అధికార పదవి ఇవ్వాలని పట్టుబడడంతో ఆ పార్టీ అంతగా ఆసక్తి చూపలేదని చెబుతున్నారు.