ఎపి ప్రభుత్వ ప్రకటనలపై అభ్యంతరం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పథకాల ప్రకటనలను తెలంగాణలో ప్రసారం చేయించడం ఎందుకని ఎంపీ వినోద్‌కుమార్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ లేనప్పటికీ ప్రభుత్వ సొమ్ముతో చంద్రబాబు ప్రకటనలు ఇస్తున్నారని, తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీలో ఉన్నందున ఆయన ప్రకటనలు ఓటర్లను ప్రభావితం చేస్తాయని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనలను తెలంగాణలో నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు అదనపు ఎన్నికల ప్రధానాధికారి జ్యోతిబుద్ధప్రకాశ్‌ను కలిసి ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదుచేశారు. ప్రభుత్వ వ్యయంతో టీవీ ఛానెళ్లలో ఇస్తున్న ప్రకటనలు ఇక్కడ కూడా ప్రసారం అవుతున్నాయని తెలుపుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేసారు.

టీవీ చానళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలను చంద్రబాబు ఇష్టానుసారంగా ప్రసారం చేయిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదుచేస్తామని తెలిపారు. టీడీపీ నాయకులు పార్టీ పరంగా ప్రకటనలు చేసుకొంటే అభ్యంతరం లేదని స్పష్టం చేసారు.

కాగా, ఎపి ప్రభుత్వం తమ నిఘా విభాగం అధికారులను తెలంగాణలో ఎన్నికల పక్రియలో వినియోగించు కొంటున్నట్లు గత నెలలో తెలంగాణ మంత్రి కేటి రామారావు ఆరోపించారు. ఎన్నికల ప్రవర్తనా నీయమవాలి కారణంగా తెలంగాణ ప్రభుత్వం తన పధకాల గురించి ప్రచారం చేసుకొనే అవకాశం లేకపోగా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృద్దా చేస్తూ ఇక్కడ ప్రచారం కోసం వినియోగిస్తున్నాట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకోవాలని కుడా కోరారు.

రాష్ట్ర విభజన తర్వాత సచివాలయంతో సహా పలు ప్రభుత్వ కార్యాలయాలను అమరావతికి ఆంధ్ర ప్రదేశ్ తరలించినా, ఎపి డిజిపి కార్యాలయంతో సహా కొన్ని ప్రభుత్వం కార్యాలయాలు హైదరాబాద్ లో కొనసాగుతున్నాయి. పదేళ్ళ పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా విభజన చట్టం పేర్కొనడంతో దానిని సాకుగా తీసుకొని తెలంగాణ ఎన్నికలలో ప్రభుత్వం యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి.