మంగళగిరి ఎయిమ్స్‌కు వాజపేయి పేరు !

మంగళగిరి ఎయిమ్స్‌కు దిగావంత ప్రధాని వాజ్‌పేయి పేరు పెట్టాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వాజపెయీతో ఉన్న ప్రత్యేక అనుబంధం నేపథ్యంలో కూడా ఎయిమ్స్‌కు వాజ్‌పేయి పేరు పెట్టాలని సూచించింది. వాస్తవానికి మూడేళ్ల క్రితమే చంద్రబాబు ప్రభుత్వం ఈ సూచన చేసింది. అయితే దీనిపై కేంద్రం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.

ఎన్టీఆర్ హయాం నుంచే వాజ్‌పేయితో టీడీపీ సంబంధాలు కొనసాగాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక స్నేహ సంబంధాలు పటిష్టమయ్యాయి. వాజపేయీ ప్రభుత్వానికి అప్పట్లో తెలుగు దేశం పార్టీ మద్దతు ఇచ్చింది.

ఢిల్లీలో వాజపేయికి శ్రద్దాంజలి ఘటించిన తర్వాత హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ప్రారంభోత్సవం  వాజ్‌పేయి చేతుల మీదుగా జరిగిన సందర్భాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈ తరుణంలో మంగళగిరి ఎయిమ్స్‌కు వాజ్‌పేయి పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్‌కు వాజ్‌పేయి పేరు పెడితే సరైన నివాళి అర్పించినట్లు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.