నాలుగు తరాల నేతలు దేశాన్ని పాలిస్తే ఏమైంది !

గాంధీ, నెహ్రూ కుటుంబంలోని నాలుగు తరాల నేతలు దేశాన్ని పాలించారని, కానీ, దేశ ప్రజల పరిస్థితులు మారలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. నవంబరు 20న ఛత్తీస్‌గఢ్‌ రెండో దశ శాసనసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. పార్టీలు ప్రచారం చేసుకునేందుకు గడువు ఆదివారం సాయంత్రంతో ముగియనుండడంతో భారతీయ జనతా పార్టీ తరఫున మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ. ‘ఆ కుటుంబ నాలుగు తరాల వారు దేశాన్ని పాలించారు. దీని వల్ల ఆ కుటుంబమే లాభం పొందింది కానీ, దేశానికి ఏ లాభమూ కలగలేదు. ప్రజల సంక్షేమం కోసం వారు ఎన్నడూ ఆలోచించలేదు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజల ఆశలను నెరవేర్చే అవకాశం ఉందని మనం ఇప్పుడు ఎలా నమ్ముతాం?’ అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఓ కుటుంబానికి (గాంధీ-నెహ్రూ) చెందిన వ్యక్తులే ఉంటున్నారు. దళిత నేత సీతారామ్‌ కేసరి గురించి మీ అందరికీ తెలుసు. కనీసం ఐదేళ్లయినా ఆయనను పార్టీకి అధ్యక్షుడిగా ఉండనివ్వలేదు. ఆయనను ఆ పదవి నుంచి తొలగించి సోనియా గాంధీని ఆ పార్టీ అధ్యక్షురాలిగా చేశారని ద్వజమెత్తారు. ఇంతకు ముందు దేశంలోని ప్రభుత్వం ఆ కుటుంబం చేతిలో ఉండే ‘రిమోట్‌ కంట్రోల్’లా ఉండేది. అది ఎల్లప్పుడూ ఆ కుటుంబం చేతిలోనే ఉండేది. ఆ కుటుంబంలోని వారికి కాకుండా ఇతరులకు ఆ పార్టీ అధ్యక్ష పదవిని ఇవ్వగలరా?’ అని మోదీ వ్యాఖ్యానించారు.

‘గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ వల్ల ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్ ఇక్కడ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. దాదాపు 10 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్రంలోనూ బిజెపి ఉంది. 2008లో యూపీఏ ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ పథకం నిజమైన రైతులకు కాకుండా అర్హులు కాని వారికి అందింది. దీని వల్ల అర్హులు ఎన్నో బాధలు పడ్డారు. కాంగ్రెస్‌ పాలనలో ‘ఫోన్‌ బ్యాంకింగ్’ ఉండేది. ఆ పార్టీ నేతలు ఒక్క ఫోను చేస్తే చాలు వారి స్నేహితులకు రుణాలు అందేవి. దాని వల్ల దేశంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి’ అని మోదీ విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన నాలుగు తరాలు దేశాన్ని పాలించినప్పటికీ ప్రజలకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు. ఆ ఒక్క కుటుంబం గురించే తప్ప ప్రజా సంక్షేమాన్ని కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామంటూ ఇప్పుడు ఆ పార్టీ చెబుతుండటాన్ని ఎలా నమ్మగలుగుతామని నిలదీశారు.