కేరళ బిజెపి నేత అరెస్ట్ తో నిరసన ప్రదర్శనలు

శబరిమల వద్ద అయ్యప్ప దేవాలయానికి వెడుతున్న కేరళ బిజెపి ప్రధాన కార్యదర్శి కె సురెంద్రన్ ను కేరళ పోలీసులు అరెస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి కార్యకర్తలు ఆదివారం నాడు నిరసన ప్రదర్శనలు జరిపారు. దేవాలయానికి వెడుతున్న సురెంద్రన్ ను పోలీసులు అడ్డగించి, అరెస్ట్ చేసి, మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, 14 రోజుల పాటు రేమాండ్ కు పంపారు. తర్వాత కొత్తరాకర సబ్ జైలు కు తరలించారు.

సురెంద్రన్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తూ కేరళలో ఇప్పుడు `జంగల్ రాజ్’ నెలకొన్నదని రాష్ట్ర బిజెపి అద్యక్షుడు పి ఎస్ శ్రీధరన్ పిళ్ళై దయ్యబట్టారు. ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని అంటూ ప్రస్తుతం శబరిమల విషయమై రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి నిరంకుశ చర్యలను తమ పార్టీ తీవ్రంగా ప్రతిఘతిస్తుందని హెచ్చరించారు.

చిత్తర్ పోలీస్ స్టేషన్ లో గత రాత్రి నిర్బందించినప్పుడు తన పట్ల దురహంకారపూరితంగా వ్యవహరించారని తనకు కనీసం తాగు నీరు, ఆహారం, మందులు కూడా ఇవ్వలేదని సురెంద్రన్ మండిపడ్డారు. కేవలం రాజకీయ దురుద్దేశ్యంతోనే తనను అరెస్ట్ చేసారని విమర్శించారు.

గత రాత్రి అంతా పోలీస్ స్టేషన్ ఎదుటు ప్రదర్శనకారులు పెద్ద సంఖ్యలో చేరి అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. తిరువంతపురంలోని రాష్ట్ర సచివాలయం ఎదుట కుడా నిరసన ప్రదర్శనలు జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కొచ్చి, కొట్టాయం, కన్నూర్ తదితర పోలీస్ స్టేషన్ ల ఎదుట నిరసన ప్రదర్శనలు జరిపారు.

అరెస్ట్ కు నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దినంగా పాటించారు. ఉదయం 10 గంటల నుండి పలు చోట్ల వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. శనివారమే హిందూ ఐక్య వేదిక అధ్యక్షురాలు పీకే శశికళ అరెస్ట్ కు నిరసనగా కేరళలో 12 గంటల పాట్లు హర్తల్ పాటించడం తెలిసిందే.

పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువకులు పలు చోట్ల రహదారులపై చేరి నిరసన వ్యక్తం చేసారు. ట్రాఫ్ఫిక్ ను తిరువంతపురం, కోచి, త్రిస్సూర్, పాలక్కాడ్ తదితర చోట్ల అడ్డుకున్నారు. `స్వామియే అయ్యప్ప’ అంటూ ప్రదర్శనకారులు నిరసన తెలిపారు.

కేరళలోని సిపిఎం ప్రభుత్వం సుప్రేం కోర్ట్ తీర్పును అడ్డుపెట్టుకొని ఏ విధంగా అయినా నిషేధిత మహిళలను శబరిమల ఆలయంలోకి తీసుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నదని, తద్వారా ఆలయ పవిత్రతను మంతగరిపే ప్రయత్నం చేస్తున్నదని తిరువంతపురంలో ప్రదర్శనకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ బిజెపి నేత ఏం ఎస్ కుమార్ దయ్యబట్టారు. అయినా ఇప్పటి వరకు భక్తుల నిరసనల కారణంగా ఒక్క మహిళను కుడా తీసుకు వెళ్ళలేక పోయినదని పేర్కొన్నారు.