బిజెపికి 300 సీట్లు .... పియూష్ గోయల్ భరోసా

వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సుమారు 300 సీట్లు గెల్చుకొంతుందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ భరోసా ఇస్తున్నారు. తాను స్వయంగా జరిపిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైనదని చెబుతున్నారు. తన సర్వే ప్రకటం బిజెపి 297 నుంచి 303 స్థానాల్లో విజయఢంకా మోగించనుందని ప్రకటించారు. ఈ సర్వేను తానే జరిపించినట్టు చెప్పారు.

దేశవ్యాప్తంగా 5.4 లక్షల మంది అభిప్రాయాలను తెలుసుకున్నామని పేర్కొన్నారు. 2013లో కూడా తాను ఇలాంటి సర్వేనే జరిపించానని, 2014 ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ సాధిస్తుందని అప్పటి సర్వే చెప్పగా, అదే నిజమైందని ఆయన తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి గత ఆగస్టు-సెప్టెంబర్‌లో సర్వే నిర్వహించామని పేర్కొన్నారు.

'సర్వే ఫలితాలు మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. 2019 ఎన్నికల్లో బీజేపీ 297 నుంచి 303 సీట్లు గెలుచుకోనుంది' అని ముంబైలో జరిగి వార్షిక ఈటీ అవార్డుల కార్యక్రమంలో గోయల్ వెల్లడించారు. ఈ సర్వేను బీజేపీ చేపట్టలేదని వివరణ ఇచ్చారు.  సహజంగా మీడియా సంస్థలు అనుసరించే పద్ధతిలోనే ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఈ సర్వే జరిపించామని మంత్రి చెప్పారు.

కాగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 545 స్థానాలకు గాను 282 సీట్లు గెలుచుకుని సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఎన్డీయే భాగస్వాములతో కలిసి ఆ బలం 336కు చేరుకుంది. అయితే గత నాలుగేళ్లలో ఆ బలం 310కి తక్కింది. ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓటమే ఇందుకు కారణం.