కూకటపల్లిలో చంద్రబాబు వ్యూహాత్మక తప్పిదమా !

కూకటపల్లి నుండి నందమూరి వారసురాలిగా దిగవంత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని అభ్యర్ధిగా నిలబెట్టడం ద్వారా ఎన్నికల ఎత్తుగడలలో తనకు మించినవారు లేరనుకొనే టిడిపి అధినేత వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడుతున్నారా ? ఆ విధంగా చేయడం ద్వారా తెలంగాణ ప్రజలలో మరోసారి సెంటిమెంట్ రగల్చే బలమైన ఆయుధాన్ని ఆత్మరక్షణలో ఉన్న అధికారపక్షం టీఆర్‌ఎస్‌ కు అందిచ్చారా ? ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఇవే చర్చలు జరుగుతున్నాయి.

హైదరాబాద్ తో ఏమి సంబంధం లేని, అటు పుట్టినిల్లు గాని, ఇటు మెట్టినిల్లు గాని కాని ఆమెను ఇక్కడకు చివరిక్షణంలో తీసుకు వచ్చి అభ్యర్ధిగా నిలబెట్టడం ద్వారా మహాకుటమి గెలుపొందితే అమరావతి నుండి పాలన సాగుతుందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేస్తున్న ఆరోపణలకు బలం చేకుర్చిన్నట్లు అవుతుందని పలువురు భావిస్తున్నారు.

అసామాన్యమైన ప్రజాబలం గల ఎన్ టి రామారావు సహితం తెలంగాణ నుండి పోటీచేసి గెలుపొందలేక పోయారని, గత సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు పార్టీ ప్రచార సారధిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ ఘోర వైఫల్యం చెందారని, చివరకు అమరావతిలో రాజధాని ఏర్పాటైనా తాను మాత్రం హైదరాబాద్ లోనే నివాసం ఉంటాను అంటూ చెప్పుకొంటూ వచ్చిన చంద్రబాబు నాయుడు సహితం రాత్రికి రాత్రి ఇక్కడి నుండి మకాం మార్చవలసి వచ్చినదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

కేవలం ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికలలో ఎన్టిఆర్ అభిమానుల అభిమానం పొందటం కోసం ఆమెకు సీట్ ఇచ్చారు గాని నందమూరి కుటుంభానికి రాజకీయంగా గుర్తింపు ఇవ్వడం కోసం మాత్రం కాదని ఈ సందర్భంగా పలువురు భావిస్తున్నారు. నిజంగా నందమూరి హరికృష్ణ మీద అంతటి అభిమానం ఉంటె గత రెండేళ్లుగా ఆయనను పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలు దూరంగా ఎందుకు ఉంచుతూ వచ్చారని, విశాఖపట్నంలో జరిగిన మహానాడు సందర్భంగా ఎందుకు అవమానకరంగా ఆయన పట్ల వ్యవహరించారని ఈ సందర్భంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎన్నికలలో ప్రజలను ఆకర్షించగల వ్యక్తి నందమూరి కుటుంభం నుండి అవసరమని, అందుకు జూనియర్ ఎన్టిఆర్ అక్కరకు వస్తారని భావిస్తున్నారు. అందుకోసమే ముందుగా వారి కుటుంభం నుండి ఆమెను అభ్యర్ధిగా అవకాశం ఇచ్చారని చెబుతున్నారు.  అయితే గతంలో ఆయన పట్ల అవమానకరంగా వ్యవహరించడం, చివరకు ఆయన సినిమాలకు ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లు కుడా దొరకకుండా అధికార బలాన్ని ఉపయోగించుకొని అడ్డుకొనే ప్రయత్నం చేయడం వంటి అంశాలు అన్ని ప్రజల మనస్సులో నుండి తొలగించడం అంత తేలికా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పైగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును చివరి వరకు వ్యతిరేకించిన పార్టీగా, తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడు దొడ్డిదారిన తిరిగి తెలంగాణపై రాజకీయ ఆధిపత్యాన్ని సాధించడానికే నందమూరి సుహాసినిని బరిలో దింపారని  ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నించడానికి ఆమె ఉనికి ఉపకరించే అవకాశం ఉంది. అందుకనే ఆమె పోటీ విషయమై తెలంగాణలోని టిడిపి నేతలు సహితం ముభావంగా ఉన్నట్లు కనిపిస్తున్నది.

ఆమె నామినేషన్ వేసిన సందర్భంలో బాలకృష్ణ స్వయంగా రావలసి రావడం, ఆమె సోదరులు ఇద్దరు సందేశం పంపడం తప్ప హాజరు కాకపోవడం, టిడిపి నేతలలో ఈ సీట్ ఆశించి భంగపడిన పెద్దిరెడ్డి ఒక్కరు మాత్రమె హాజరు కావడం ఈ సందర్భంగా గమనార్హం. ఆమె పోటీ చేయడం, ప్రచారం అంతా బాలకృష్ణ భుజస్కందాలపై వేయడం వల్లన దాని ప్రభావం మొత్తం తెలంగాణలోనే పడగలడని కాంగ్రెస్ నేతలు సహితం ఆందోళన చెందుతున్నారు.

తెలనగానకు చెందిన డిటిపి సీనియర్ నేత పెద్దిరెడ్డికి ఆ సీట్ ఇస్తామని ముందుగా చెప్పి, చివరిలో మొండి చెయ్యి చూపడం కుడా తెలంగాణ సెంటిమెంట్ ను రగల్చేందుకు అధికార పక్షానికి ఉపయోగ పడే అవకాశం ఉంది. ఇప్పటికే కేవలం 14 సీట్లకు మాత్రమె పోటీ చేస్తున్న చంద్రబాబు లక్ష్యంగా కెసిఆర్ దాడి జరుపుతూ ప్రజలలో సెంటిమెంట్ రగల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణపై చంద్రబాబు కుట్ర రాజకీయాలకు ఈ పోటీ ఒక సూచన అని మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంది.