ఎపిలో ఇసుకపై టీడీపీ టాక్స్‌ : కన్నా

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఇసుకపై టీడీపీ టాక్స్‌ కడుతున్నారని, ఆ టాక్స్‌మీద వచ్చే డబ్బును చంద్రబాబు నాయుడు, లోకేష్‌ పంచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముందు నుంచే వేల లారీల ఇసుక అక్రమంగా తరలిపోతుందని ఆరోపించారు.

రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని, బయటి ప్రపంచానికి మాత్రం రైతులే స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రాజధాని పేరుతో భూములు తీసుకుని  సింగపూర్ కంపెనీలు కట్టబెట్టారని ఆరోపించారు. చంద్రబాబు పాలన బ్రిటీష్‌ పాలనను తలపిస్తోందని దయ్యబట్టారు.

తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి గ్రామ పరిధిలోని పంట పొలాలను పరిశీలించిన కన్నామూడు పంటలు పండే భూములను తీసుకొని చిన్న, సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నరకాసుర పాలన జరుగుతోందని మండిపడుతూ టీడీపీ నేతల అక్రమాలకు కొమ్ముకాసే అధికారులు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

చంద్ర బాబు ఇంటిని చూస్తేనే ప్రజాస్వామ్యం ఎలా ఉందో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొంగలా దొరికి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చారని విమర్శించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కన్నా హెచ్చరించారు.