పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఎన్నిక

పాకిస్తాన్‌ నూతన ప్రధాన మంత్రిగా మాజీ క్రికెటర్‌, పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఎన్నికయ్యారు. పాక్‌ 22వ ప్రధాన మంత్రిగా శనివారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాధారణ ఎన్నికల అనంతరం నేషనల్‌ అసెంబ్లీ సభ్యులతో ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవడం పాకిస్తాన్‌లో ఆనవాయితీ. ఈ మేరకు పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌కు 176 ఓట్లు రాగా, షాబాజ్‌ షరీఫ్‌కు 96 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ ఇమ్రాన్‌ ఖాన్‌ను ప్రధానిగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది.

ప్రధానిగా ఎన్నికవ్యాలంటే 172 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, ఇమ్రాన్‌ ఖాన్‌కు నలుగురు సభ్యుల అదనపు మద్దతు లభించింది. పీపీపీ సహా కొన్ని విపక్ష పార్టీలు ఓటింగ్‌కు గైర్హాజరవడంతో ఇమ్రాన్ గెలుపు నల్లేరు మీద నడకయింది.

కొత్తగా ఎన్నికైన స్పీకర్ అసద్ క్వైసర్ ఓటింగ్ ఫలితాలను వెల్లడించారు. ఓటింగ్ ఫలితాలను స్పీకర్ వెల్లడిస్తున్న సమయంలో కొంతమంది హౌజ్ సభ్యులు నినాదాలు చేశారు. న మంజూర్, వజిర్ ఈ అజామ్ నవాజ్ షరీఫ్ అంటూ నినాదాలు చేశారు. ఈ ఎంపిక సరైంది కాదని, దీనికి మేం ఒప్పుకోమని.. పీఎం నవాజ్ షరీఫే అంటూ పీఎంఎల్ ఎన్ సభ్యులు తమ నిరసన వ్యక్తం చేశారు. వాళ్లు నిరసన వ్యక్తం చేస్తుండగా ఇమ్రాన్ ఖాన్ తన సీటులో కూర్చొని చిరునవ్వు చిందించారు. తన పార్టీ సభ్యులు ఖాన్‌కు అభినందనలు తెలియజేశారు.

అధికారుల సమాచారం ప్రకారం శనివారం ఉదయం 9.15 నిమిషాలకు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా జూలై 25న దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పీటీఐ 116 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. 272 స్థానాల్లో పోటీ చేసిన పీటీఐ అధికారానికి  కేవలం 21 స్థానాల దూరంలో  నిలిచిపోయింది.

ఈ ఎన్నికకు ముందు మీడియాతో మాట్లాడుతూ నూతన పాకిస్తాన్‌ను ఆవిష్కరించడమే తన ధ్యేయమని అన్నారు. కాగా, ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇస్లామాబాద్ చేరుకున్నారు.