మాల్దీవులతో ద్వైపాక్షిక సంబంధం బలోపేతం

మాల్దీవులతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఆ దేశ నూతన అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్‌తో కలిసి ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. మాల్దీవుల అధ్యక్షుడిగా సోలిహ్ ప్రమాణ స్వీకారం తర్వాత ఆయనతో మోదీ సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి పుంజుకుంటాయని మోదీ, సోలిహ్ విశ్వాసం వ్యక్తంచేశారు.

హిందూ మహా సముద్ర ప్రాంత దేశాల పరిధిలో శాంతి, భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇరువురు అధినేతలు నిర్ణయానికి వచ్చారు. సెప్టెంబర్ 23న జరిగిన ఎన్నికల్లో అబ్దుల్లా యమీన్‌పై సోలిహ్ ఆశ్చర్యకరమైన రీతిలో విజయం సాధించారు. సోలిహ్ ఆహ్వానం మేరకు ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరైన మోదీ ప్రధానిగా మాల్దీవులలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 2011లో భారత ప్రధానిగా మన్మోహన్‌సింగ్ ఆ దేశంలో పర్యటించారు.

శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగ కూడా సోలిహ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఇటీవల మాల్దీవులలో జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్యం, భవిష్యత్ పట్ల ఆ దేశ ప్రజల ఆకాంక్షలను తెలియజేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. సోలిహ్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరు కావడంతో చైనా ప్రభావం నుంచి మాల్దీవుల బయటపడుతున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌కు చైనా అనుకూల వాది అన్న విమర్శ ఉంది. యమీన్ హయాంలో మాల్దీవులలో చైనా ప్రాభల్యం పెరగడటంతో భారత్‌తోపాటు అమెరికా, దాని మిత్ర దేశాలు ఆందోళన చెందాయి. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సోలిహ్ కూడా చైనా పెట్టుబడులు, రుణాలను సమీక్షిస్తామని ప్రకటించారు.