హెచ్-4 వీసాను రద్దు అడ్డుకోవలంటూ కాంగ్రెస్ లో బిల్

హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకిచ్చే హెచ్-4 వీసాను రద్దు చేయకుండా ట్రంప్ సర్కార్‌ను నిరోధించాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌లో ఇద్దరు చట్టసభ సభ్యులు ఒక బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్-4 వీసాను రద్దు చేయడం వల్ల విదేశీ ఉద్యోగులు తమ ప్రతిభను అమెరికాకు వ్యతిరేకంగా ఉపయోగించే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

హెచ్-1బీ వీసాపై అమెరికాకు వచ్చే విదేశీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు హెచ్-4 వీసాను మంజూరు చేస్తారు. ఈ వీసా పొందిన వారు అమెరికాలో తమ అర్హతకు తగిన ఏదైనా పనిచేయడానికి అర్హులవుతారు. ప్రత్యేక సాంకేతిక నైపుణ్యం ఉన్న వారిని అమెరికన్ సంస్థలు తమ కంపెనీలలో చేర్చుకొనేందుకు హెచ్-1బీ వీసా జారీ చేస్తారు. భారత్‌కు చెందిన అనేకమంది ఐటీ నిపుణులు హెచ్-1బీ వీసాపై అమెరికాలోని వివిధ కంపెనీలలో పనిచేస్తున్నారు.

హెచ్-1బీ వీసా ఉన్న వారి జీవితభాగస్వామి లేదా సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే హెచ్-4 వీసాను జారీ చేస్తారు. నైపుణ్యత అవసరం లేని ఉద్యోగాలలో హెచ్-4 వీసా పొందిన వారు చేరుతూ అమెరికన్లకు అవకాశాలు లేకుండా చేస్తున్నారన్న నెపంతో ట్రంప్ సర్కార్ ఆ సదుపాయాన్ని రద్దు చేసేందుకు సిద్ధమైంది.

ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కోరుతూ చట్టసభ సభ్యులు అన్నా జీ ఈషూ, జోయి లాఫ్‌గ్రెన్ హెచ్-4 ఉపాధి పరిరక్షణ బిల్లును ప్రవేశపెట్టారు. ఒబామా సర్కార్ హెచ్-4 వీసాను ప్రవేశపెట్టిన తరువాత దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగాలు పొందారని, వారిలో ఎక్కువమంది భారతీయులు, అందులోను మహిళలు ఎక్కువగా ఉన్నారని వారు తెలిపారు. హెచ్-4వీసాతో పనిచేస్తున్న విదేశీయులు అమెరికాలో పోటీతత్వాన్ని పెంచడమేకాకుండా, వేల మంది హెచ్-1బీ ఉద్యోగులపై, వారికుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సదుపాయం తొలిగిస్తే చాలామంది వలసదారులు తమ కుటుంబం నుంచి విడిపోవాల్సి వస్తుందని లేదా తమ స్వదేశం వెళ్లిపోవాల్సి ఉంటుందని తెలిపారు. అలా వెళ్లిపోయిన వారు తమ ప్రతిభను అమెరికాకు వ్యతిరేకమైన వ్యాపారాలలో ఉపయోగించే అవకాశముందని హెచ్చరించారు. ఆర్థిక అవసరాలతోపాటు కుటుంబాలను కలిపి ఉంచడానికి హెచ్-4 వీసాను పరిరక్షించాలని చట్టసభ సభ్యులు కోరారు. హెచ్-4 వీసాను రద్దు చేయడం వల్ల అమెరికాకు ఎటువంటి ఉపయోగం లేదని స్పష్టం చేసారు.