సిఎం పదవికి పోటీ వస్తారనే శశిధర్ రెడ్డికి రిక్త హస్తం

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తనయుడు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సన్నిహిత సంబంధాలు గల మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కి సనత్ నగర్ సీట్ దక్కక పోవడం కాంగ్రెస్ పార్టీలోనే గాకుండా మొత్తం రాజకీయ వర్గాలకు విస్మయం కలిగిస్తున్నది. ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కుట్ర పూరితంగా వ్యవహరించి, పార్టీ అధిష్టానాన్ని తప్పుతోవ పట్టించి తనకు సీట్ రాకుండా చేసారని తీవ్రమైన ఆరోపణ చేసారు.

సికింద్రాబాద్ నుండి పోటీ చేయమని పార్టీ నాయకత్వం చెబుతున్నా ఆయన ఒప్పుకోవడం లేదు. సోనియా, రాహుల్ లతో మంచి సంబంధాలు ఉన్న ఆయన ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపొందితే ముఖ్యమంత్రి పదవికి ఎక్కడ అడ్డువస్తారో అనే భయంతో అసలు పోటీలో లేకుండా చేసారని పార్టీ వర్గాలు బహిరంగంగానే పేర్కొంటున్నాయి. అదే ఎత్తుగడతో ప్రముఖ బిసి నేత, మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సీట్ కుడా రాకుండా చేసే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు.

లక్ష్మయ్య పోటీ చేయదలచిన సీట్ ను టిజేఎస్ అద్యక్షుడు కోదండరామ్ అడుగుతున్నారు అంటూ ఆ సీట్ ను అడ్డుకొనే ప్రయత్నం చేసారు. అయితే తొలినుండి ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయడానికి భయపడుతున్న కోదండరామ్ ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవి ఇస్తామని అంటూ స్వయంగా రాహుల్ గాంధీ హామీ ఇవ్వడంతో జారిపోయారు. దానితో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఎత్తుగడలో పారలేదు.

సనత్ నగర్ నుండి శశిధర్ రెడ్డి గతంలో పలు సార్లు గెలిచినా ఆ సీట్ తెలుగు దేశం అడుగుతున్నదని అంటూ అడ్డుకొన్నారు.  గెలిచే సీట్లను త్యాగం చేయకూడదని రాహుల్‌ గాంధీ చాలా సార్లు చెప్పారని ఈ సందర్భంగా శశిధర్‌ రెడ్డి పేర్కొన్నారు. తాను పదవుల కోసం పాకులాడే రకం కాదని స్పష్టం చేస్తూ గెలుపు కోసమే పొత్తులు పెట్టుకొంటే తాను వాటికి కట్టుబడి ఉంటానని తెలిపారు.

అయితే ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్క్రీనింగ్‌ కమిటీలో మాట్లాడుతూ ‘శశిధర్‌ రెడ్డి గెలవలేరు’ అని వాదించారని ఆరోపించారు. వీటికి ఉత్తమ్‌ చేయించిన సర్వేలనే ఆధారంగా చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించేవిధంగా చేశారని దుయ్యబట్టారు.

దీనిని సోమవారం లోపు పార్టీ హైకమాండ్‌ మరోసారి పరిశీలించాలని శశిధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. టిడిపి నేతలు కూడా తాను గెలుస్తానని బలంగా నమ్ముతున్నారని చెబుతూ  సనత్‌నగర్‌ సీటును టిడిపి అడగలేదని శశిధర్‌రెడ్డి స్పష్టం చేసారు. తన వెనుక కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పదవుల కోసం తాను ఆరాటపడటంలేదన్నారు. ప్రజలు తనకు మద్దతు తెలుపుతున్న సమయంలో ఇలా జరిగడం పట్ల విస్మయం వ్యక్తం చేసారు. “నేను ఏ నిర్ణయం తీసుకొన్నా.. కార్యకర్తలు, ప్రజల ఆలోచన మేరకే నడుచుకుంటా”నని చెబుతూ పోటీకి దిగుతాని సంకేతం ఇచ్చారు.