బిహార్‌, జార్ఖండ్‌, ఒడిషాలలో బిజెపి ప్రాబల్యం !

బీజేపీకి కీలకంగా మారిన రానున్న లోకసభ ఎన్నికల్లో  ఆ పార్టీ పలు రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తుందని  పొలిటికల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (పీఎస్‌ఈ) వెల్లడించింది. పీఎస్‌ఈ ప్రకటించిన ఓ సర్వేలో బీహార్, జార్ఖండ్‌, ఒడిషా రాష్ట్రాల్లో కమలం మరోసారి వికసిస్తుందని తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కీలకంగా మారిన బిహార్‌లో ఆ పార్టీ మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని, గడిచిన నాలుగున్నరేళ్ల బీజేపీ పాలనపై రాష్ట్ర ప్రజలు సంతృప్తుగా ఉ‍న్నట్లు పీఎస్‌ఈ వెల్లడించింది.

ప్రధానిగా నరేంద్ర మోదీ పాలనను మరో ఐదేళ్లపాటు కొనసాగించేందుకు వారు అనుకూలంగా ఉన్నట్లు సర్వే తెలిపింది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌ క్రేజ్‌ గత రెండేళ్ల కాలంలో రెండు శాతం పెరిగింది. నితీష్‌ను మరోసారి సీఎంగా 48 శాతం బిహారీలు కోరుకుంటున్నట్లు పేర్కొంది. ఐతే బీజేపీ, జేడీయూ మిగిలిన భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకం విభేదాలు ఎటువైపు దారితీస్తుందో అన్న అంశం ఆసక్తికరంగా మారింది. 

పార్లమెంట్‌ ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగే రాష్ట్రాల్లో దక్షిణ రాష్ట్రమైన ఒడిషా ఒకటి. మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతమైన  ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం పాలనపై 29 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల మాదిరిగానే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలను సాధిస్తుందని పీఎస్‌ఈ తెలిపింది.

కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పాలనపై అత్యధికంగా ప్రజలు స్పందించారు. మరోసారి ఆయనే సీఎంగా కోరుకుంటున్నట్లు 54 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేయగా, 24 శాతం మంది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రథాన్‌ కావాలని కోరుకుంటున్నట్లు సర్వే ప్రకటించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజూ జనతాదళ్‌ (బీజేడీ) మరోసారి అధికారం నిలుపుకునే అవకాశం ఉందని పేర్కొంది. 

బీజేపీ పాలిత మరో రాష్ట్రమైన జార్ఖండ్‌లో కేంద్ర ప్రభుత్వం పాలనపై 40 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఈ రాష్ట్రం కీలకం కానుంది. ముఖ్యమంత్రిగా రఘువరన్‌దాస్‌ పాలనపై 26 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయగా... తదుపరి సీఎంగా రఘువరన్‌నే కావాలనుకునే వారు 36 శాతం మంది. హేమంత్‌ సోరెన్‌కు 26 శాతం ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వే తెలిపింది.

రాష్ట్రంలోని 14 లోక్‌సభ నియోజకవర్గల్లో ప్రజలను సంప్రదించి ఈ సర్వే ఫలితాలను విడుదల చేసినట్లు పీఎస్‌ఈ తెలిపింది. కాగా ఈ ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రల్లో ఆ పార్టీ కొంత మెరగైన ఫలితాలనే రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు  అభిప్రాయపడుతున్నారు. సర్వే తెలిపిన ఈ మూడు రాష్ట్రల్లో నిరుద్యోగం, తాగు నీటి సదుపాయం ప్రధాన సమస్యలుగా ఎత్తిచూపారు.