చర్చి ఫాదర్ల లైంగిక వేధింపులు సిగ్గుచేటు

అమెరికాలో చర్చి ఫాదర్లు దశాబ్దకాలంగా లైంగిక దాడులకు పాల్పడటంపై వాటికన్‌ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఆ సంఘటనలు సిగ్గుచేటని, బాధాకరమైనవని పేర్కొంది. గత ఏడు దశాబ్దాల కాలంలో దాదాపు 1000 మందిపై పెన్సిల్వేనియాలోని రోమన్‌కాథలిక్‌ ఫాదర్లు లైంగిక దాడులకు పాల్పడ్డారని అమెరికా గ్రాండ్‌ జ్యూరి విడుదల చేసిన నివేదిక పేర్కొంది. దీనిపై వాటికన్‌ మౌనాన్ని వీడుతూ సుదీర్ఘ ప్రకటన చేసింది.

లైంగిక దాడులకు పాల్పడిన వారిని, వారికి రక్షణగా ఉన్న వారిని శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. వాటికన్‌ సిటీలోని అధికారులు జ్యూరి అధికారులు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఈ నివేదిక అమెరికన్‌ చర్చిని వణికించిందని దాని ప్రతినిధి గ్రెగ్‌ బర్క్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై చట్టాలకు కట్టుబడి ఉండాలని ఆయన తెలిపారు. ఈ లైంగిక దాడులు విశ్వాసాన్ని, విశ్వాసకుల స్ఫూర్తిని ఎంతగా దెబ్బతీస్తాయన్న విషయాన్ని పోప్‌ ఫ్రాన్సిస్‌ అర్థం చేసుకున్నారని ఆయన చెప్పారు.

ఇటువంటి సంఘటనలు జరగకుండా కూకటివేళ్ళతో పెకిలించివేయాలని పోప్‌ భావిస్తున్నారని కూడా చెప్పారు. అమెరికా కేథలిక్‌ చర్చిలో లైంగిక దాడులపై ఇంతకుముందెన్నడూలేని విధంగా జరిపిన దర్యాప్తు నివేదికను గ్రాండ్‌ జ్యూరి మంగళవారం విడుదల చేసింది. గడిచిన 70 సంవత్సరాలలో దాదాపు 301 మంది ఫాదర్లు మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడినట్లు జ్యూరి తన నివేదికలో పేర్కొంది.