25 నుంచి రాష్ట్రంలో అమిత్‌ షా పర్యటన

నామినేషన్ల ఘట్టం పూర్తి అవుతూ ఉండడంతో బిజెపి నేతలు ఇప్పుడు ప్రచారంపై ద్రుష్టి సారిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అద్యక్షుడు అమిత్ షాలతో పాటు పలు కేంద్ర మంత్రులు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లు సహితం తెలంగాణలో పలు ప్రచార సభలలో పాల్గొనబోతున్నారు.

ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియగానే బిజెపి అద్యక్షుడు అమిత్ షా తెలంగాణ, రాజస్థాన్ లో జరిగే ఎన్నికల ప్రచార సభలపై పూర్థి స్థాయిలో పాల్గొనబోతున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా ఒక్క తెలంగాణలోనే 12 నుంచి 15 సభల్లో ప్రచారం నిర్వహించబోతున్నారు. తెలంగాణలో ఈనెల 25, 27, 28వ తేదీల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ నాయకులు తెలిపారు. రోజుకు 3 సభలకు పైగా ఆయన పాల్గొనబో తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

డిసెంబర్ 7న రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నందున అదే నెల 1 నుంచి 4వ తేదీ లోగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.  హైదరాబాద్, నిజామాబాద్, సూర్యాపేటలో జరిగే  ఎన్నికల ప్రచార సభల్లో మోడీ పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది.

కేంద్రమంత్రి జేపీ నడ్డా పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా, బీజేఎల్పీ మాజీ నేత జీ కిషన్ రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ హాజరవుతున్నారని పార్టీ నేతలు తెలిపారు.

కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం వస్తున్నారు. ఆమె పలు నియోజకవ ర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అదే విధంగా మరికొంతమంది కేంద్రమంత్రు లు కూడా ప్రచారానికి వస్తున్నారు. వీరికి సంబంధించిన షెడ్యూల్ ను పార్టీ నేతలు రూపొందిస్తున్నారు.