40 స్థానాల్లో బరిలోకి దిగనున్న కాంగ్రెస్‌ రెబల్స్‌

కాంగ్రెస్‌లో టికెట్లకై కుమ్ములాటలు పతాకస్థాయికి చేరాయి. టీఆర్‌ఎస్‌ను ఓడిస్తామంటూ కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కూటమికడితే, ఆ కూటమినే ఓడించేందుకు తిరుగుబాటు అభ్యర్థులు కొత్త కూటమిని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అన్యాయానికి బలైపోయామంటూ 40 మంది తిరుగుబాటు అభ్యర్థులు `తెలంగాణ రెబల్ ఫ్రంట్‌’గా ఏర్పడుతున్నట్టు ప్రకటించారు. ఒకే గుర్తుతో పోటీచేస్తామని చెప్పారు.

ఏండ్లతరబడి పార్టీని నమ్ముకుని పనిచేసినవారిని కాదని బ్రోకర్లు, గూండాలు, రౌడీషీటర్లకు టికెట్లు అమ్ముకున్నారని రెబల్ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తున్న మాజీ మంత్రులు బోడ జనార్దన్, విజయరామారావు చేసిన ప్రకటన రాజకీయంగా సంచలనం రేపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమి ఖాయమని, అందుకు ప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డియే బాధ్యత వహించాలని వారు స్పష్టం చేసారు. ఉత్తమ్ చేసిన పనితో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఏర్పడ్డాయని ఎద్దేవా చేసారు.

టికెట్ల కోసం పార్టీలోకి వచ్చినవారికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం కల్పించవద్దని రాహుల్‌ ఎన్నో సభల్లో, సమావేశాల్లో సూచించినా ఉత్తమ్, ఆర్‌.సి.కుంతియా టికెట్ల కోసం బేరమాడి, ఎంత ఖర్చు పెడతారో చెప్పాలంటూ అభ్యర్థిత్వాలను అమ్ముకున్నారన్నారు. తమ వద్ద ఆధారాలున్నాయని త్వరలోనే వాటిని బయటపెడతామన్నారు. పార్టీ సభ్యత్వంలేని 19 మందికి టికెట్లు అమ్ముకున్నారన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కావాలనే అభ్యర్థుల జాబితాను లీక్‌ చేసి, తర్వాత మీడియాలో వచ్చింది నమ్మవద్దంటూ చెప్పారని, తీరా అదే జాబితా అధికారికంగా వెలువడటం వెనుక ఎన్నికోట్లు చేతులు మారాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

పార్టీ కోసం ఎన్నోయేళ్లు కష్టపడితే తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలలోపు పార్టీలో చేరిన వారికి, మూడుదఫాలుగా ఓడిపోయిన వారికి టికెట్లు కేటాయించారని బోడ జనార్దన్‌ ఆరోపించారు. కుంతియా సహాయంతో ఉత్తమ్‌కుమార్‌ తనకు ఇష్టమైనవారికి సీట్లు కేటాయించారని ఆయన ద్వజమెత్తారు. కాంగ్రెస్‌ ఎంపిక చేసిన జాబితాలో రౌడీషీటర్లుగా నమోదైనవారు, బ్యాంకు దోపిడిదార్లు, రియల్‌ ఎస్టేట్‌ సెటిల్‌మెంటుదార్లు ఉన్నారని విజయరామారావు ఆరోపించారు. నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత ఆ జాబితాను బహిర్గతం చేస్తామని తెలిపారు.

తెలంగాణ ఇచ్చినందుకు సోనియా రుణం తీర్చుకోవాల్సిన తాము రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరామని, ముందస్తు ఎన్నికల నాటికి తామే అభ్యర్థులుగా ఉన్నామని  జనార్దన్‌ అన్నారు. తీరా ఎన్నికలు దగ్గరపడేసరికి పారాచూట్లకు టికెట్లను అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారాచూట్లకు టికెట్లుండవని రాహుల్‌ చెప్తుంటే ఉత్తమ్, కుంతియా, భట్టి విక్రమార్క మహాకూటమి పేరుతో మాయకూటమి పెట్టి టికెట్లు అమ్ముకున్నారన్నారు. కాంగ్రెస్‌ గెలవాల్సిన చోట ఓడిపోయే వ్యక్తులను నిలుచోబెట్టి పార్టికి నష్టం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదిలాఉంటే.. కూటమిలో టికెట్లు ఆశించి భంగపడినవారు సొంతపార్టీ అభ్యర్థి అయినా, మిత్రపక్ష అభ్యర్థి అయినా ఓడించడమే లక్ష్యమని హెచ్చరిస్తున్నారు. కొత్తగూడెంను కాంగ్రెస్‌కు ఎలా వదిలేస్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేసిన నియోజకవర్గ సీపీఐ నాయకులు, కార్యకర్తలు సమావేశంలో కుర్చీలు విరగ్గొట్టారు. మరోవైపు కూకట్‌పల్లిలో టీడీపీ తరఫున నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ స్థానిక నాయకత్వం ఆమెను ఓడించి తీరుతామని శపథం చేసింది.

కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీజేఎస్ సైతం కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్‌ను నమ్ముకోవడంవల్ల జరుగకూడని నష్టం జరిగిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ద్వజమెత్తారు. సమరభేరి మోగించాల్సిన తరుణంలో టికెట్లపైనే కసరత్తు చేయాల్సిరావడం దురదృష్టకరమని వాపోయారు.

టీడీపీలోనూ తిరుగుబాట్లు సెగలు రేపుతున్నాయి. కూటమి పేరుతో ఎవరికో టికెట్లు ఇస్తే తామేం కావాలని భంగపడిన అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. వెరసి తమనుతామే ఓడించుకునే దిశగా కూటమి సాగుతున్నదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.