గాంధీయేతరుడికి పగ్గాలివ్వగలరా : మోదీ సవాల్

కాంగ్రెస్, గాంధీ కుటుంబం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాకుండా మరో వ్యక్తిని కనీసం ఐదేండ్లు కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించగలరా? ఒకవేళ నియమిస్తే మాజీ ప్రధాని నెహ్రూ నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పారని నేను భావిస్తా. నా సవాల్‌ను స్వీకరించగలరా అని ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. చాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని అయ్యారంటే ఆ గొప్పతనమంతా నెహ్రూ నెలకొల్పిన ప్రజాస్వామ్యం వల్లే సాధ్యమైందని ఇటీవల కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ సవాల్‌ను విసిరారు.

“ఇటీవల కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ల వల్లే నేను ప్రధాని అయినట్లు మాట్లాడుతున్నారు. నెహ్రూ నిర్మించిన ప్రజాస్వామ్యం వల్లే ఇది సాధ్యమైందని అంటున్నారు. ఇదే నిజమైతే గాంధీ కుటుంబం నుంచి కాకుండా కాంగ్రెస్‌లోని ఓ మంచి నాయకుడిని ఆ పార్టీ అధ్యక్షుడిగా నియమించగలరా? ఒకవేళ నియమిస్తే అప్పుడు నమ్ముతా నిజమే.. మాజీ ప్రధాని నెహ్రూ నిర్మించిన ప్రజాస్వామ్యం వల్లే నేను ప్రధాని కాగలిగానని” అని మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యమనే కాంట్రాక్టును గాంధీ కుటుంబానికి ఇవ్వలేదని ఎద్దేవాచేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడుత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన అంబికాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడుతూ ఈ దేశాన్ని గాంధీ కుటుంబం నాలుగు దశాబ్దాలు పాలించింది. కానీ దేశానికి ఏం చేసింది. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి మాట్లాడే హక్కు కేవలం గాంధీ కుటుంబానికే ఉన్నదా? మిగతా వారికి లేదా? ఎర్రకోట నుంచి గాంధీ కుటుంబమే కాదు.. మిగతా వాళ్లు కూడా ప్రసంగించవచ్చని ప్రజలు నిరూపించారని పేర్కొన్నారు.

ప్రజల కష్టాలను మీరు(గాంధీ కుటుంబం) ఎప్పుడూ అర్థం చేసుకోలేరు. కానీ ఒక చాయ్‌వాలా(మోదీ) అర్థం చేసుకోగలడు అని ప్రద్నై ధ్వజమెత్తారు. ఛత్తీస్‌గఢ్‌లో ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదని స్పష్టం చేసారు. “మీ(రాహుల్) తాత, నానమ్మ, మీ కుటుంబం దాదాపు నాలుగు తరాలు దేశాన్ని పాలించారు. కనీసం ఛత్తీస్‌గఢ్‌లో నీటి పైపులను వేశారా? మీరు పైపులను వేస్తే ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ ధ్వంసం చేశారా? ముందు వీటికి సమాధానం చెప్పి తర్వాత మమ్మల్ని విమర్శించు” అని రాహుల్‌పై విరుచుకుపడ్డారు.

“నన్ను చూస్తే వాళ్లకు మంటపుడుతుంది. నాలుగున్నరేండ్ల నుంచి ఏడుస్తూనే ఉన్నారు. చాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధాని కుర్చీలో ఎలా కూర్చున్నాడని వాళ్లకు ఈర్ష్య” అని మోదీ ఎద్దేవా చేసారు. పెద్ద నోట్ల రద్దుతో పెద్ద తలకాయలకు దిమ్మతిరిగిందని, ఒక దెబ్బతో మంచాలలో, గోనె సంచుల్లో దాచుకున్న సొమ్మంతా బయటపడిందని చెప్పారు. నక్సల్ ప్రభావిత ప్రాంతంలో జరిగిన మొదటి విడుత ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదు కావడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ 55 ఏళ్ల పాలనలో సమకూర్చని విద్యుత్, ఎల్పీజీ, బ్యాంకు సేవలు వంటి సౌకర్యాల్ని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేరువచేసిందని మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో మోదీ తెలిపారు. ‘ నాలుగు తరాల కాంగ్రెస్‌ పాలన, నాలుగున్నరేళ్ల చాయ్‌వాలా పాలన మధ్య పోటీ పెడదాం. అందరికీ బ్యాంకింగ్‌ సేవలు అందించాలన్న లక్ష్యంతో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బ్యాంకుల్ని జాతీయం చేశారు. కానీ పేదలకు ఈ నిర్ణయంతో ఎలాంటి ప్రయోజనం కలగలేదు. కానీ మా ప్రభుత్వం నాలుగున్నరేళ్లలోనే అందరికీ బ్యాంకింగ్‌ సేవలు కల్పించింది’ అని పేర్కొన్నారు.