ప్రభుత్వ లాంఛనాలతో వాజ్‌పేయీ అంత్యక్రియలు

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు లక్షలాది ప్రజలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌ వద్ద అభిమానులు, సన్నిహితుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చివరి సారిగా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వాజ్‌పేయి భౌతిక కాయాన్ని సందర్శించి పుష్పగుచ్ఛములుంచి చివరిగా నివాళులర్పించారు. అటల్‌ దత్తపుత్రిక నమిత .. వాజ్‌పేయీ చితికి నిప్పంటించగా, హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేశారు.

అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భూటాన్‌ రాజు వాంగ్‌చుక్‌, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, త్రివిధ దళాధిపతులు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, సీనియర్‌ నేతలు ఎల్ కే అద్వాని సహా పలువురు స్మృతి స్థల్‌లో మహానేతకు నివాళులర్పించారు.

అంత్యక్రియల్లో పార్టీలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు హాజరై అశ్రునయనాలతో తుది నివాళులర్పించారు. వాజ్‌పేయి అంత్యక్రియల్లో  హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ, ఎస్పి అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆ పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌,  పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌, భాజపా సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. దీంతో దిల్లీ వీధులు కిక్కిరిశాయి. విజయ్ ఘాట్ పక్కన 1.5 ఎకరాల్లో వాజ్‌పేయి మెమోరియల్ ఏర్పాటు చేశారు. వాజ్‌పేయి అంతిమ యాత్రలో ఆయన్ను కడసారి చూసేందుకు భారీసంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వాజ్‌పేయి మృతికి సంతాపంగా 15 రాష్ట్రాలు సెలవుదినంగా ప్రకటించగా.. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ఏపీలోనూ 7 రోజుల పాటు సంతాప దినాలు జరుపుకోనున్నారు.