చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబట్టిన జేడీ లక్ష్మీనారాయణ

ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. సీబీఐకి ఇచ్చిన అనుమతిని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అయితే ఎందుకు రద్దు చేశారో చెప్పగలగాలని ప్రశ్నించారు. ఒక సంస్థపై ఆరోపణలు వస్తే ఆ సంస్థనే దర్యాప్తు చేయవద్దనడం సరికాదని హితవుపలికారు. డాక్టర్‌ బాగాలేడని ఆస్పత్రిని మూసేస్తామా అని మరోసారి ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల కేంద్ర సంస్థల్లో పనిచేసే అవినీతికి పాల్పడే ఉద్యోగులు మరింత రెచ్చిపోతారని హెచ్చరించారు. ఇప్పుడు కేసు మొత్తాన్ని తయారు చేసి రాష్ట్రప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ప్రతి కేసు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లాల్సిందేనని, అవినీతిని ఎదుర్కొనే ఉద్యమానికి ప్రభుత్వ నిర్ణయం ప్రతిబంధకమని ఆయన అభిప్రాయపడ్డారు.

సీబీఐ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, దీనిపై అవసరమైతే రాజకీయ పోరాటం చేసుకోవాలని సూచించారు. సంస్థలను ఇలా నిర్వీర్యం చేయడం మంచిదికాదని లక్ష్మీనారాయణ హితవు చెప్పారు.

‘‘ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి కేసులో కోర్టు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తు జరుగుతుంది. సెక్షన్‌6లో ఉన్న నిబంధనలు కోర్టు ఉత్తర్వులకు వర్తించవు. కర్ణాటక మైనింగ్‌ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు ఇలాంటి ఉత్తర్వులే ఇచ్చింది. కర్ణాటక ప్రభుత్వం సాధారణ అనుమతిని రద్దు చేసింది. మళ్లీ తిరిగి అనుమతి ఇచ్చింది’’ అని లక్ష్మీనారాయణ స్పష్టం చేసారు.