దొంగలను కాపాడేందుకు చూస్తున్న చంద్రబాబు : కన్నా

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండతో రాష్ట్రాన్ని అడ్డంగా దోచేశారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. దొంగలను కాపాడేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని, సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా చంద్రబాబు యత్నించడం సిగ్గుచేటని ఆయన ద్వజమెత్తారు.

జగన్‌పై దాడి కేసులో సీబీఐ విచారణ జరిగితే... ఎక్కడ బండారం బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని కన్నా దయబట్టారు. చంద్రబాబు హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని అంటూ పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం బ్రోకర్‌ పనులు చేస్తోందని లక్ష్మీనారాయణ మండిపడ్డారు.

ఓటుకు నోటు కేసు భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన చంద్రబాబు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని కన్నా ఎద్దేవా చేసారు. తనకు ఏదో జరగబోతోందనే ఊహలో చంద్రబాబు ఉన్నారని చెప్పారు. ఐటీ అధికారులకు సహకరించం, సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వమని చెబుతుండమే ఇందుకు నిదర్శనమని తెలిపారు.

దేశం మొత్తం చక్రంలాగా తిరిగి వచ్చిన చంద్రబాబు తానే చక్రం తిప్పుతున్నట్లు ఫీలవుతున్నారని లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. బాబుకు శాలువాలు కప్పిన వారంతా ఎన్డీఏ వ్యతిరేకులేనని పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుతో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  

కాగా, ప్రవైటు కంపేనీలపై ఐటీ దాడులు జరిగితే.. ఆయన మీద జరిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు విమర్శించారు. వారం రోజులుగా చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం ఏ విధంగా బెంబేలెత్తుతున్నారో చూస్తున్నామని చెప్పారు. మూడు నెలల కిందట సీబీఐకి ఇచ్చిన అనుమతి ఇప్పుడు ఉపసంహరించుకోవడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.

అక్రమ సంపాదన ఆర్జించే వారికి కొమ్ముకాయడానికి, అవినీతిని ప్రోత్సహించేందుకే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోందని జివిఎల్ ద్వజమెత్తారు. ఒక అవినీతి కూటమి కోసం రెండు సార్లు ఢిల్లీ వచ్చి వెళ్లారని విమర్శించారు. అవినీతి చేయడం ఎలా? అవినీతి బయటపడకుండా ఉండటం ఎలా అనే విజన్ డ్యాంకుమెంట్‌ను చంద్రబాబు రాసుకోవాలని ఎద్దేవా చేసారు.

సీబీఐలోని కలహాలను ఆసరాగా చేసుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. అప్రజాస్వామిక నిర్ణయాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని స్పష్తం చేసారు. మోదీ ప్రభుత్వం పూర్తి పారదర్శక పాలన అందించాలని, అవినీతి అంతం చేయాలని చూస్తుంటే.. చంద్రబాబు దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని జీవీఎల్ దుయ్యబట్టారు.