తమిళనాడుకు రాజ్‌నాథ్ సింగ్ భరోసా

గజ తుపానుతో చిగురుటాకులా వణుకుతున్న తమిళనాడుకు అన్ని విధాలా సాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఇవాళ ఉదయం కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామితో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితిపై ఆరా తీసినట్టు ఆయన ట్విటర్లో వెల్లడించారు.

 ‘‘తమిళనాడు ముఖ్యమంత్రి  పళనిస్వామితో మాట్లాడాను. తుపాను బారిన పడిన ప్రాంతాల్లో పరిస్థితిపై సమాచారం అడిగి తెలుసుకున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సాధ్యమైన సహాయం చేస్తామని చెప్పాను. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించి రాష్ట్రప్రభుత్వానికి సాయపడాల్సిందిగా హోం సెక్రటరీకి సూచించాను..’’ అని ఆయన పేర్కొన్నారు.

కాగా, తుపాను కారణంగా కురిసిన వర్షాలకు ఇప్పటివరకూ 20 మంది మృతిచెందారు. ఒక్క తంజావూరులోనే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. తిరువారూర్‌లో నలుగురు, పుడుక్కొట్టాయ్‌లో ముగ్గురు, తిరుచిలో ఇద్దరు, నాగపట్నంలో ఒకరు మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు.

తుపాను ప్రభావంతో ఇప్పటివరకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 82వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజల కోసం 471 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గజ తుపాను అటు పుదుచ్చేరిని సైతం అతలాకుతలాం చేస్తోంది. అక్కడ బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తుపాను బీభత్సంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు పర్యటిస్తున్నారని, ప్రజలకు సహాయక చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. తుపానుపై అంచనా వేస్తున్నట్లు చెప్పారు. సహాయక చర్యల కోసం మొత్తం 2500 మంది సిబ్బందిని రంగంలోకి దించినట్టు విపత్తు నిర్వహణ ఇంచార్జ్ గగన్‌దీప్ సింగ్ బేడీ పేర్కొన్నారు.