కాకినాడ సీపోర్టు అక్రమాలలో చంద్రబాబు, జగన్ భాగస్వాములా !

కాకినాడ సీపోర్టు కేంద్రంగా జరుగుతున్న అక్రమ వ్యవహారాలపై అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిరసన గళం విప్పారు. ఈ పోర్టు కేంద్రంగా జరుగుతున్న నాసిరకం బియ్యం ఎగుమతుల కారణంగా అంతర్జాతీయంగా దేశీయ ఉత్పత్తులకు చెడ్డపేరు వస్తోందని ద్వజమెత్తారు. ఈ పోర్టు కేంద్రంగా నాసిరకం బియ్యం ఎగుమతి జరుగుతున్నాయనే విషయం తనకు ఒక ఆఫ్రికా దేశం విద్యార్థివల్ల తెలిసిందని వెల్లడించారు.  

కాకినాడ సీపోర్టులో జరుగుతున్న అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోపోవడం, విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించకపోవడాన్ని బట్టి వారిద్దరికీ ఇందులో భాగస్వామ్యం ఉందని అనుమానించాల్సివస్తుందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న పోర్టు అధినేత కేవీరావుపై ఆ దేశ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)కు ఫిర్యాదుచేస్తామని పవన్ వెల్లడించారు. పోర్టు పేరిట పర్యావరణానికి చేస్తున్న హానిని వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

విశాఖపట్నంలో ఒక చిన్న థియేటర్ నిర్వహించే కేవీరావు (మెలోడీ వెంకటేశ్వరరావు) కొద్దికాలంలోనే ఒక పోర్టుకు, కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కెఎస్‌ఈజడ్)కి యజమాని ఎలా కాగలిగారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పోర్టులో కొత్త బెర్తుల నిర్మాణం పేరుతో ఈ ప్రాంత మత్స్యకారులకు ఫిషింగ్ చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.  

అలాగే కాకినాడ నగరానికి తుపాన్లు, ఉప్పెనల నుండి రక్షణ కవచంగా ఉన్న హోప్ ఐలాండ్‌కు కూడా తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనివల్ల భవిష్యత్తులో కాకినాడ నగరం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసారు.

తక్షణం కేవీ రావును భారత దేశానికి రప్పించి, ఈ వ్యవహారాలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్‌చేశారు. తాము అధికారంలోకి వస్తే పర్యావరణానికి, ప్రజాజీవనానికి నష్టం చేకూరుస్తున్న కాకినాడ సీపోర్టుతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని తక్షణం రద్దుచేస్తామని స్పష్టం చేసారు.

కాకినాడ సీపోర్టు మాత్రమే కాకుండా కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కేఎస్‌ఈజడ్) పేరుతో గత ప్రభుత్వాలు రైతుల నుండి వేలాది ఎకరాలను సేకరించి, కేవీరావుకు రాసిచ్చేశాయని పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. సెజ్ పేరిట సేకరించిన పంట భూముల్లో పరిశ్రమలు ఏర్పాటుకాకపోతే వాటిని రైతులకు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేసారు.

విపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు సెజ్ భూముల్లో ఏరువాక నిర్వహించి, రైతులకు న్యాయం చేస్తానని ప్రకటించి, అధికారంలోకి వచ్చాక మర్చిపోయారని ఎద్దేవా చేసారు. తక్షణం కాకినాడ సెజ్ రైతులకు న్యాయం చేయకపోతే సింగూరు తరహా ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. అలాంటి ఉద్యమం వస్తే జనసేన రైతులకు అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు.