ఇండో, పసిఫిక్ లో శాంతి, శ్రేయస్సే లక్ష్యం

ఇండో, పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసారు. సింగపూర్‌లో జరిగిన 13వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు (ఈఏఎస్)లో ఆయన మాట్లాడుతూ సభ్య దేశాల మధ్య బహుళపక్ష సహకారం, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు పెంపొందాలని కోరారు. తూర్పు ఆసియా కూటమిలో పది ఆసియా దేశాలు (ఇండొనేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మయన్మార్, కాంబోడియా, బ్రూనై, లావోస్)తోపాటు భారత్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, రష్యా, అమెరికా సభ్య దేశాలు.

ఇండోపసిఫిక్ ప్రాంతం శాంతియుతంగా, స్వేచ్ఛగా, సమ్మిళితంగా ఉండాలన్న భారత్ ఆకాంక్షను ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) ఒప్పందానికి, నౌకాయాన సహకారానికి కూడా భారత్‌ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.

సదస్సు ప్రారంభానికి ముందు జపాన్ ప్రధాని షింజో అబేతోపాటు పలువురు ప్రపంచ నేతలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. దానికిముందు జరిగిన ఆసియాన్-భారత్ అల్పాహార సదస్సులో కూడా మోదీ పాల్గొన్నారు. ఆసియాన్ దేశాలతో భారత్‌కు బలమైన సంబంధాలున్నాయని, తామంతా కలిసి భూమి మీద శాంతి, శ్రేయస్సుకు దోహదం చేస్తున్నామని ప్రధాని ఆ తరువాత ట్వీట్ చేశారు.

అంతకు ముందు రోజు జరిగిన ఫిన్‌టెక్ వేడుకలో కీలకోపన్యాసంతో ప్రధాని మోదీ తన రెండు రోజుల సింగపూర్ పర్యటనను ప్రారంభించారు. పలు కార్యక్రమాలు, సభల్లో పాల్గొన్న మోదీ గురువారం సాయంత్రం భారత్‌కు బయలుదేరారు.

కాగా, భారత్-సింగపూర్ తొలి హ్యాకథాన్‌లో విజేతలుగా నిలిచిన ఆరు జట్లకు ప్రధాని మోదీ బహుమతులందజేశారు. విజేతలుగా నిలిచిన జట్లలో మూడు భారత్‌కు చెందినవి కూడా ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆవిష్కరణలను, యువశక్తిని ప్రదర్శించడానికి హ్యాకథాన్ చక్కని వేదిక అని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 36 గంటలపాటు జరిగిన గ్రాండ్ ఫినాలేలో భారత్, సింగపూర్‌లకు చెందిన మూడేసి జట్లు పాల్గొన్నాయి.