అంతిమ యాత్రలో కాలినడకన మోడీ, అమిత్ షా

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంతిమ యాత్రలో కాలినడకన ముందుంది ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పాల్గొని వాజ్‌పేయి పట్ల తమ గౌరవాన్ని  చాటుకున్నారు.  తద్వారా తమ నేతకు కడసారి నివాళులర్పించేందుకు భారీగా తరలివచ్చిన జన సందోహానికి, బీజేపీ నేతలు, శ్రేణులకు  స్ఫూర్తిగా నిలిచారు.  కాగా తమ మహానేతకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు అశ్రునయనాల మధ్య అంతిమ యాత్ర బిజెపి కేంద్ర కార్యాలయం నుండి సాగింది.

అంతకుముందు వాజ్‌పేయి నివాసంనుంచి బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న వాజ్‌పేయి భౌతికకాయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అగ్రనేత ఎల్‌.కె.అద్వానీ, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే, పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఇతర ముఖ్యనేతలు నివాళులర్పించారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతిపట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ వాజ్‌పేయి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.  అలాగే నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రులు పీకే గ్యావల్‌, లక్ష్మణ్‌ కిరిల్లా, అబ్దుల్‌ హసన్‌ మహ్మద్‌ అలీ, పాకిస్థాన్‌ న్యాయశాఖ మంత్రి అలీ జఫర్‌లు సాయంత్రానికి ఢిల్లీ చేరుకుని వాజ్‌పేయి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆఫ్గనిస్తాన్‌  మాజీ ప్రెసిడెంట్‌  హమీద్‌ ఖర్జాయ్‌ కూడా నివాళులు అర్పించారు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్లు పి.సదాశివం, భన్వరీలాల్‌ పురోహిత్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, నేవీ చీఫ్‌ సునీల్‌ లాంబా, ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తదితరులు మాజీ ప్రధానికి నివాళులర్పించారు.

కేవలం బీజేపీ అభిమానులు మాత్రమే కాదు అటల్ వ్యక్తిత్వాన్ని అభిమానించే వేల మంది ప్రజలు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర అంతిమ యాత్ర సాగింది. దారి పొడవునా అటల్ జీ అమర్‌రహే నినాదాలు వినిపించాయి.