ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ : రాజ్‌నాథ్‌ సింగ్‌

కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీల విశ్వసనీయత సంక్షోభంలో చిక్కుకుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, విశ్వసనీయత లేకపోవడం వల్లే పార్టీ ఛత్తీస్‌గఢ్‌ లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం లేదని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. బిజెపి హయాంలో రాష్ట్రంలో నక్సలైట్ల ప్రాబల్యం బాగా తగ్గిందని చెప్పుకొచ్చారు.

గతంలో దేశంలో దాదాపు 90 జిల్లాలు నక్సలైట్ల ఆధీనంలో ఉండేవని, ఇప్పుడు కేవలం పది నుంచి పదకొండు జిల్లాల్లో వారి ప్రాబల్యం మిగిలిందని హోం మంత్రి తెలిపారు. రానున్న మూడు నుంచి ఐదేళ్లలో పూర్తిగా నక్సల్స్‌ను ఏరివేస్తామని హామీ ఇచ్చారు.

ఎన్నికల సందర్భంగా రాజ్‌నాథ్ గురువారం ప్రచార సభలు నిర్వహించేందుకు ఛత్తీస్‌గఢ్‌ వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నక్సలైట్లు హింసను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. పునరావాసం తదితర సదుపాయాలన్నీ ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, వారి మేనిఫెస్టో అర్థంలేనిదని విమర్శించారు.

కాగా, అంతకు ముందు ఢిల్లీలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను రాజ్‌నాథ్ సింగ్ సమర్థించారు. అఫ్రిదీ సరిగ్గానే మాట్లాడారని తెలిపారు. వాళ్ళు పాకిస్థాన్‌నే నిభాయించలేక పోతున్నారని ఎద్దేవా చేసారు. అలాంటపుడు కశ్మీరును ఏ విధంగా నిభాయించగలరని ప్రశ్నించారు. కశ్మీరు భారతదేశంలో భాగమని, అలాగే కొనసాగుతుందని స్పష్టం చేసారు.

షాహిద్ అఫ్రిది ఇటీవల బ్రిటన్ పార్లమెంటు వద్ద విద్యార్థులతో మాట్లాడుతూ కశ్మీరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కశ్మీరు తమకు అక్కర్లేదని, పాకిస్థాన్‌లో ఇప్పుడు ఉన్న నాలుగు ప్రావిన్స్‌లను ఆ దేశం నిభాయించుకోలేకపోతోందని చెప్పారు.  కశ్మీరును భారతదేశానికి కూడా ఇవ్వొద్దని, కశ్మీరుకు స్వాతంత్ర్యం రావాలని సూచించారు.  మానవత్వం సజీవంగా ఉండాలని ఆకాంక్షించారు. అమాయకులు మరణించకూడదని చెప్పారు. ప్రజలు మరణించడం బాధాకరమని తెలిపారు. ఏ మతానికి చెందినవారు మరణించినా బాధాకరమేనని తెలిపారు.