శబరిమలపై అఖిల పక్షం నుండి కాంగ్రెస్, బిజెపి వాకౌట్

శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో గురువారం జరిగిన ఈ సమావేశం నుంచి కాంగ్రెస్, బీజేపీ వాకౌట్ చేశాయి.

మండల - మకరవిళక్కు పూజల సమయంలో శుక్రవారం ఈ దేవాలయాన్ని తెరుస్తారు. మకర సంక్రాంతి తర్వాత మళ్ళీ మూసివేస్తారు. దానితో కేరళలో తిరిగి అలజడి చెలరేగుతున్నది. ఈ విషయమై గతంలో ఇచ్చిన తీర్పును జనవరిలో సమీక్ష జరపడానికి సుప్రీం కోర్ట్ అంగీకరించిన రెండు రోజుల తర్వాత విజయన్ జరిపిన అఖిల పక్ష సమావేశంలో సమస్య పరిష్కారానికి ఎటువంటి ప్రతిపాదనలు ఉంచకుండా, ఏకపక్షంగా ఏదిఏమైనా మహిళలను దేవాలయంలోకి అనుమతిస్తామని భీష్మించుకొని ఉండడంతో సమావేశం విఫలమైనది.

సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేయడంతో రసభ జరిగింది. ఈ అఖిల పక్ష సమావేశానికి రాష్ట్ర న్యాయ శాఖ మంత్రిని ఆహ్వానించకపోవడమే అందుకు నిదర్శనమని చెప్తున్నారు.

ప్రతిపక్షాలు ఇస్తున్న సలహాలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి మొండి వైఖరి ఆవలంభించడంతొ సమావేశం విఫలమైన్నట్లు ప్రతిపక్ష నాయకుడు రమేష్ చేన్నితాల తెలిపారు. శబరిమలలో శాంతి నెలకొల్పేందుకు వచ్చిన ఓ సువర్ణావకాశాన్ని సీఎం వృథా చేశారని ఆయన దుయ్యబట్టారు.

అఖిల పక్ష సమావేశం ఒక పెద్ద ఫార్స్ అని బిజెపి రాష్ట్ర అద్యక్షుడు శ్రీధరన్ పిళ్ళై విమర్శించారు.  సిపిఎం ప్రధాన కార్యాలయం ఎకేజి భవన్ లో తయారైన స్క్రిప్ట్ ప్రకారం ఈ సమావేశం జరిపారని, ఇతరుల సలహాలు వినే ప్రయత్నం చేయలేదని ద్వజమెత్తారు. “కేరళ స్టాలిన్ పాలించిన రష్యా కాదని ప్రజలు నిర్పుపిస్తారు” అని హెచ్చరించారు.

ప్రభుత్వం శబరిమలను రణరంగంగా మార్చాలని చూస్తోందని ఆరోపిస్తూ ఈ వ్యవహారంలో పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించి సంప్రదాయాలను పరిరక్షించాలని ఆయన కోరారు.  

ప్రతిపక్షాలు వాకౌట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. ఈ తీర్పు అందరికీ వర్తిస్తుందని చెబుతూ  భక్తులందరికీ భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసారు.

ఇలా ఉండగా, శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశానికి ప్రత్యేక రోజులను ప్రకటించే అవకాశం ఉందని కేరళ ముఖ్యమంత్రి విజయన్ చెప్పారు. 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్కులైన మహిళలకు ఈ దేవాలయంలో ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.

 అఖిల పక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో  సీఎం మాట్లాడుతూ అయ్యప్ప దేవాలయం ప్రధాన అర్చకుడితో చర్చలు జరుపుతామని చెప్పారు. పండలం ప్యాలెస్ ప్రతినిథులతో కూడా మాట్లాడతామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంలో ఏమాత్రం వెనుకకు తగ్గేది లేదని స్పష్టం చేసారు. అయ్యప్ప దేవాలయంలో మహిళల ప్రవేశానికి ప్రత్యేక రోజులను కేటాయించడానికి చర్చలు జరుపుతామని తెలిపారు.