ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బిజెపి అగ్రనేతలు బండారు దత్తాత్రేయ, కిషన్రెడ్డి, డా లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ కండువాతో శోభను బిజెపి రాష్ట్ర అద్యక్షులు డా. లక్ష్మణ్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్కు మొదటి నుంచి అండగా ఉండి, తెలంగాణ కల సాకారం కావడంలో తన వంతు పాత్ర పోషించానని గుర్తుచేశారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ను అరెస్ట్ చేస్తే కారంపొడి పట్టుకుని పోలీసులపై తిరుగుబాటు చేశానని వెల్లడించారు. అలాంటి తనకు నేడు టీఆర్ఎస్లో ఆదరణ కరువైందని వాపోయారు. టీఆర్ఎస్లో పూర్తిస్థాయి నాయకురాలిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన తాను గత 70 రోజులుగా కేసీఆర్ పిలుపు కోసం వేచిచూశానని చెప్పారు. కవిత, కేటీఆర్, వినోద్, కేశవరావులను కలిసిన ఫలితం దక్కలేదని, ప్రగతి భవన్లో అడుగుబెట్ట లేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల తీర్పు, సర్వే నివేదిక ప్రకారమే టికెట్ ఇస్తామని కేసీఆర్ చెబుతున్నారని, అయితే 90 శాతం ప్రజల సపోర్టు తనకున్నా ఎందుకు టికెట్ ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. దళిత బిడ్డనైన తనకు తీవ్ర అన్యాయం చేశారని అంటూ మాదిగలు టీఆర్ఎస్ను వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు. కేసీఆర్ సడ్డకుడు(తోడల్లుడు) రవీందర్ రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కారణంగానే తనకు టీఆర్ఎస్ టికెట్ రాలేదని ఆమె ఆరోపించారు. తెలంగాణలో కవిత ఒక్కరే చాలా? నా లాంటి బిడ్డ వద్దా? అని ప్రశ్నించారు.
చొప్పదండిలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, సెగ్మెంట్ అభివృద్ధి చేస్తానని బొడిగే శోభ పేర్కొన్నారు. శోభతోపాటు మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ బొడిగె శోభకు జరిగిన అన్యాయమే టీఆర్ఎస్ మోసానికి నిదర్శనమని చెప్పారు. బెయిల్పై వచ్చి మహాకూటమి నేతలు ఓట్లు అడుగుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తుకు ప్రాతిపదిక ఏంటని లక్ష్మణ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ నుంచి ఎవరు గెలిచినా టీఆర్ఎస్లోకి వెళ్తారని ఆయన జోస్యం చెప్పారు.