కాంగ్రెస్ లోకి ఇద్దరు టీఆర్ఎస్‌ ఎంపిలు !

తెలంగాణలో  టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వెల్లడించడంతో రాజకీయ వర్గాలలో కలకలం రేగుతున్నది. ఈ విషయమై టీఆర్ఎస్‌ వర్గాలు మౌనం వహించడం గమనార్హం. పైగా, అసెంబ్లీ ఎన్నికల లోపు ఆ ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరతారని, చేతనైతే వారిని ఆపాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రేవంత్ సవాల్‌ చేశారు. వారేవ్వరా అంటూ రాజకీయ వర్గాలలో ఆసక్తి చెలరేగుతున్నది. ఈ సందర్భంగా చేవెల్ల ఎంపి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌ లపై అందరూ దృష్టి పడుతున్నది.

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చాలా కాలంగా టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి పార్టీలో ఇస్తున్న ప్రాధాన్యతపై విశ్వేశ్వర్‌రెడ్డి ఆగ్రహంగా ఉంటూ వస్తున్నారు. తనకు కాకుండా మహేందర్‌రెడ్డికి పార్టీ పెద్దపీట వేస్తుందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వతున్నారు. దీంతో విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని కొంత కాలంగా కధనాలు వెలువడుతున్నాయి.

చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ ఎదురీదుతోందని తాజాగా కొండా పేర్కొనడం ఈ వాదనలకు బలం చేకురుస్తున్నది. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పోటాపోటీగా ఉన్నాయని చెబుతూనే అన్నిచోట్లా టీఆర్‌ఎస్‌కు ఎదురీత తప్పడంలేదని స్పష్టంచేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాల్లో తాను చురుకుగా ప్రచారంలో పాల్గొన్నానని, అయితే, ఇటీవల అనారోగ్య కారణాలరీత్యా మరిన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించలేకపోతున్నట్లు తెలిపారు.

ఒక విధంగా పార్టీ మారుతున్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. విశ్వేశ్వర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నేత చల్లా మాధవరెడ్డిలు సహితం కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరో వంక, తిరిగి తనకు సీట్ ఇవ్వక పోవచ్చానే భావనతో మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌ పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు చెబుతున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి తాను పోటీ చేసేందుకు వీలు లేకుండా కేరళకు చెందిన ఐపీఎస్‌ అధికారి లక్ష్మణ్‌ నాయక్‌ను టీఆర్‌ఎస్‌ ప్రోత్సహిస్తోందని ఆయన ఆగ్రహంగా  ఉన్నారు. మళ్లీ సీటు ఇచ్చేది లేదనే సంకేతాలను కూడా టీఆర్‌ఎస్‌ ఆయనకు పంపినట్టు తెలుస్తోంది.

ఇదే సమయంలో మహబూబాబాద్‌ ఎంపీగా కాంగ్రెస్‌ నుంచి గతంలో పోటీచేసిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ ఈసారి మహబూబాబాద్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తుండడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్‌ లోక్‌సభకు పోటీచేసే అవకాశం కల్పిస్తామన్న భరోసా మేరకు సీతారాం నాయక్‌ కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికలకు ముందు ఇద్దరు ఎంపీలు అధికార టీఆర్‌ఎస్‌ను వీడటం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ విషయమై తగు నష్ట నివారణ చర్యలు తీసుకొనే తీరిక టీఆర్‌ఎస్‌ నాయకత్వంలో కనబడటం లేదు.