2021లో మానవ సహిత యాత్రకు ఇస్రో సన్నద్ధం

అంతరిక్షంలోకి సొంతంగా మానవసహిత యాత్ర చేపట్టాలన్న భారత కల త్వరలోనే సాకారం కానుంది. 2021లో ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగం చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సన్నద్ధమవుతోంది. ‘జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3-డీ2’ ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ ఈ మేరకు పలు వివరాలు వెల్లడించారు.

ప్రతిష్ఠాత్మక ‘గగన్‌యాన్‌’ ప్రాజెక్టులో భాగంగా 2022లోగా అంతరిక్షంలోకి మానవసహిత యాత్ర చేపట్టేందుకు ఇస్రో ప్రయత్నిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. సంబంధిత ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయని తాజాగా శివన్‌ తెలిపారు. మానవసహిత యాత్రకు ముందుగా రెండు మానవరహిత నమూనా ప్రయోగాలు చేపడతామని వెల్లడించారు.

తొలి నమూనా ప్రయోగాన్ని 2020 డిసెంబరులో చేపట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. 2021 డిసెంబరులో మానవసహిత ప్రయోగం చేపట్టాలని తమకుతాము లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు.

మానవసహిత యాత్రలో భాగంగా రోదసీలోకి వెళ్లే వ్యోమగాములు 5-7 రోజులపాటు అక్కడే ఉండి ప్రయోగాలు చేస్తారని శివన్‌ చెప్పారు. అనంతరం వారిని సురక్షితంగా భూమి మీదకు తీసుకొస్తామని పేర్కొన్నారు. మానవసహిత ప్రయోగాన్ని శ్రీహరికోట నుంచే నిర్వహించనున్నట్లు శివన్‌ స్పష్టం చేశారు. ఈ ప్రయోగానికి అనుగుణంగా ప్రత్యేకమైన లాంచ్‌ప్యాడ్‌ను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.

భారీ ప్రయోగాలకు నమ్మకమైన వాహక నౌకగా జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 మారిందని శివన్‌ పేర్కొన్నారు. దీనిద్వారా వరుసగా రెండు ప్రయోగాలు విజయవంతమైన సంగతిని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రయోగం విజయవంతమవ్వడంతో భవిష్యత్తులో 6 టన్నుల బరువైన ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే స్థాయికి చేరుకునేలా పరిశోధనలను కొనసాగిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ఇకపై నిర్వహించే ఒక్కో ప్రయోగంతో 300 కిలోల బరువును పెంచుకుంటూ వెళ్తామన్నారు. ‘చంద్రయాన్‌-2’ విజయవంతమయ్యేందుకు ఈ వాహకనౌక ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. జీశాట్‌-29 ప్రయోగానికి సుమారు రూ.300 కోట్లు వెచ్చించామని శివన్‌ తెలిపారు.

వచ్చే ఏడాది జనవరిలోగా 10 ప్రయోగాలు నిర్వహించేందుకు ఇస్రో ప్రణాళికలు రచించినట్లు శివన్‌ వెల్లడించారు. వాటిలో 6 ఉపగ్రహ ప్రయోగాలు, 4 వాహకనౌక ప్రయోగాలు ఉన్నాయని తెలిపారు. జనవరిలో ‘చంద్రయాన్‌-2’ను ప్రయోగిస్తామని చెప్పారు.

ఫ్రెంచ్‌ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి జీశాట్‌-11 ఉపగ్రహాన్ని డిసెంబరులో ప్రయోగిస్తామని శివన్‌ తెలిపారు. జీశాట్‌-20ని కూడా వచ్చే ఏడాది సెప్టెంబరులో అక్కణ్నుంచే ప్రయోగిస్తామన్నారు. జీశాట్‌-19, జీశాట్‌-29లను ఇప్పటికే నింగిలోకి పంపిన సంగతిని గుర్తుచేశారు. ఈ నాలుగు ప్రయోగాలతో మన అంతర్జాల వేగం 100 జీబీపీఎస్‌కు చేరుతుందని శివన్‌ వివరించారు.