రెండు దేశాల మధ్య శాంతి నిజమైన నివాళి

ఇండియా, పాకిస్థాన్ మధ్య శాంతి నెలకొల్పడమే దిగవంత భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయికి  నిజమైన నివాళి అని పాకిస్థాన్ కాబోయే ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేసారు. ఉపఖండంలో అత్యంత గౌరవించదగిన రాజకీయత నేత వాజ్‌పేయి అని, ఇండోపాక్ సంబంధాలను మెరుగుపరచడం కోసం ఆయన చేసిన కృషిని ఎప్పుడూ గుర్తుంచుకుంటారని ఆయన చెప్పారు.

వాజ్‌పేయి మరణంతో ప్రస్తుతం దక్షిణాసియాలో ఓ రాజకీయ శూన్యత ఏర్పడిందని ఇమ్రాన్ తెలిపారు. రెండు దేశాల మధ్య విభేదాలు ఉండొచ్చుగానీ, సరిహద్దుకు ఇరువైపుల ప్రజలూ శాంతి కోరుకుంటున్నారని ఇమ్రాన్ స్పష్టం చేసారు. ఆ శాంతిని నెలకొల్పడం ద్వారా మాత్రమే వాజ్‌పేయికి మనం నిజమైన నివాళులు అర్పించగలమని చెప్పారు. వాజ్‌పేయిని కోల్పోయిన బాధలో ఉన్న భారతీయుల వెంటే తాను ఉన్నానని ఇమ్రాన్ స్పష్టంచేశారు.

భారత విదేశాంగా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇరు దేశాల సత్సంబంధాల కోసం ఆయన పడ్డ తపన మరవలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఇమ్రాన్‌ ఖాన్‌ తెలిపారు.

కాగ, ఓ రాజనీతిజ్ఞుడిగా ఇండియా, పాకిస్థాన్ సంబంధాల కోసం కృషి చేసిన నేతగా వాజ్‌పేయిని కొనియాడింది పాకిస్థాన్ విదేశాంగ శాఖ. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు 1999, ఫిబ్రవరి 19న బస్సులో వాజ్‌పేయి లాహోర్ వెళ్లారు. అక్కడ పాక్‌తో ఓ శిఖరాగ్ర చర్చల్లో పాల్గొన్నారు. అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, వాజ్‌పేయికి వాఘా సరిహద్దు దగ్గర సాదరంగా ఆహ్వానం పలికారు.