ప్రధాని మోదీ మరోసారి అధికారంలోకి రావాలి !

నిరంతరం దేశం గురించి ఆలోచించే ప్రధాని నరేంద్రమోదీ మరోసారి అధికారంలోకి రావడం అవసరమని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేర్కొన్నారు. ఎకనామిక్స్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్యూలో మోదీపై ప్రశంసల జల్లు కురిపిస్తూ మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి క్రమశిక్షణ, పరిశుభ్రత, ఆర్థిక వృద్ధి మీద దృష్టి సారించారని ప్రశంసించారు. ఇటువంటి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం మంచి విషయమని చెప్పారు.

దేశ అభివృద్ధి పట్ల ఆసక్తి ఉన్న జాతీయ నాయకుడిగా మోదీకి మనం కృతజ్ఞులై ఉండాలని చెబుతూ గత అయిదేఏళ్ళలో  ఆయన దేశంలో  అవినీతి నిర్మూలనకు, క్రమశిక్షణ, పరిశుభ్రతపై దృష్టి కేంద్రీకరించారని తాను భావిస్తున్నానని తెలిపారు. దానితో ఆర్థికవ్యవస్థ పురోగమించిందని, ఇది  మంచి విషయం అని చెప్పారు. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా  దృఢంగా  పోరాడుతున్న మోదీ సర్కార్‌ మళ్లీ అధికారంలోకి రావడం దేశానికి మంచిదని వ్యాఖ్యానించారు.

కేంద్ర స్థాయిలో ఉన్న అవినీతిని నిర్మూలించేందుకు ప్రధాని మోదీ మంత్రివర్గం విశేషమైన కృషి చేసిందని ఆయన కొనియాడారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీపై ఇన్ఫీ నారాయణమూర్తి ప్రశంసల జల్లు కురిపిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

‘దేశ ఆర్థికాభివృద్ధి సాధించేలా చేయడం కోసం ప్రధాని మోదీ ప్రయత్నిస్తుంటారు. కేంద్ర స్థాయిలో ఉన్న అవినీతిని రూపుమాపేందుకు మోదీ, ఆయన కేబినెట్‌ ఎంతో కృషి చేసింది. ఇప్పుడు అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు చాలా తక్కువగా వింటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. రఫేల్‌ ఒప్పంద వివాదం గురించి ఆయన్ను ప్రశ్నించగా దీనికి సంబంధించిన నిజానిజాలు తెలియనందు వల్ల దానిపై స్పందించలేదనని చెప్పారు. అలాగే ఆర్‌బీఐ వివాదంపై స్పందిస్తూ.. ఆయా సంస్థలు దృఢంగా ఉండాలని చెప్పారు.

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను వంటి సంస్కరణలు ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేసేందుకేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటి అమలు తీరు సక్రమంగా లేకపోతే అందుకు ప్రధాని ఎంతమాత్రం బాధ్యులు కారని, అధికారులకే ఆ బాధ్యత ఉంటుందని ఆయన స్పష్టం చేసారు.

ఇలా ఉండగా, ప్రపంచంలో అతి కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ నిలవడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  అయితే గ్రామ గ్రామానికి వెళ్లి అ‍క్కడి కాలుష్యం, పరిశుభ్ర పరిస్థితులను  ప్రధాని గమనించ లేరు కదా అని ప్రశ్నించారు. అది ఆయన బాధ్యత కాదు అని నారాయణ స్పష్టం చేసారు.  మనం చాలా బాధ్యతారాహిత్యంగా, క్రమశిక్షణా రహితంగా ఉన్నామని చెబుతూ ఈ సమస్య భారతీయల మనస్తత్వంతో, వ్యక్తిత్వాలతో ముడిపడి వుందని చెప్పారు. అంతేకాదు దేశంలో ఆర్థిక పరివర్తన సాధించాలంటే తక్షణమే సాంస్కృతిక పరివర్తన చాలా అవసమని మూర్తి అభిప్రాయపడ్డారు.