కాంగ్రెస్ పై బెదిరింపుగా 12 సీట్లను ప్రకటించిన టిజేఎస్ !

మహాకూటమిలో సీట్ల పంపకంలో గందరగోళం కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఇదుకు తక్కువ సీట్లకు ఒప్పుకోమని అంటూ హడావుడి చేసిన సిపిఐ చివరకు రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పోటీ చేయడానికి ఒక స్థానం ఇవ్వగానే మూడు సీట్లకు రాజీ పడ్డారు. ఇప్పుడు తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) సహితం అదే బాటలో ఉన్నట్లు ఏకంగా 12 సీట్లలో పోటీ చేస్తున్నట్లు ఆయా సీట్ల పేర్లను ప్రకటించింది.

పార్టీ అద్యక్షుడు కోదండరామ్ పోటీ చేయదలచిన జనగాం స్థానం తనకే కావాలంటూ అక్కడి నుండి గతంలో నాలుగు సార్లు గెలుపొందిన మాజీ పిసిసి అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీలో మకాం వేసి పట్టుబడుతూ ఉండడంతో ఈ ఎత్తుగడ వేసిన్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటి వరకు కాంగ్రెస్ కేవలం 8 సీట్లు మాత్రమె ఇస్తామని స్పష్టం చేయడం, అందుకు టిజేఎస్ సహితం దాదాపు ఆమోదం తెలపడం జరిగింది.

అయితే నామినేషన్లకు సమయం ప్రారంభమై మూడు రోజులు గడిచిన ఇప్పటి వరకు ఒక్క అభ్యర్ధిని కూడా ప్రకటించలేదు. 12 స్థానాలలో పోటీ చేస్తామని ప్రకటించినా అక్కడ పోటీ చేసే అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పిఎల్ విశ్వేశ్వర రావు తెలిపారు. దుబ్బాక, మెదక్, మల్కాజిగిరి, అంబర్ పేట, సిద్దిపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, అసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్, జనగాం, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ నుంచి పోటీకి దిగనున్నట్టు ప్రకటించారు.

కాంగ్రెస్‌ పార్టీతో జనగాం సీటుపై పంచాయతీ తేలకుండానే ఇక్కడి నుంచి తామే పోటీ చేస్తామని టీజేఎస్‌ ప్రకటించడం విశేషం. పొత్తులో భాగం‍గా టీడీపీకి వెళ్లిన మహబూబ్‌నగర్‌ స్థానంలోనూ పోటీ చేస్తామని టీజేఎస్‌ ప్రకటించడం ద్వారా తమ సీట్ల కోసం కాంగ్రెస్ పై వత్తిడి తేవాలని పరోక్షంగా సంకేతం ఇచ్చిన్నట్లు అయింది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన అసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్‌లోనూ బరిలోకి దిగుతామని ప్రకటించింది.

అసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్‌, మహబూబ్‌నగర్‌లో తాము బలంగా ఉన్నామని, కచ్చితంగా గెలుస్తామని టీజేఎస్‌ చెబుతోంది. ఇక్కడి అభ్యర్థులను ఉపసంహరించుకునేలా కాంగ్రెస్‌, టీడీపీలను ఒప్పిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఎక్కడా స్నేహపూరక పోటీ ఉండదని చెబుతూనే, తాము మాత్రం వెనక్కు తగ్గబోమన్న సంకేతాలు ఇచ్చింది. మరోవంక కాంగ్రెస్ తో జరుగుతున్న సీట్ల బెరసరాలపై అసంతృప్తితో ఉన్న తమ పార్టీ నాయకులను బుజ్జగించే ప్రయత్నంలోనే టీజేఎస్‌ ఈ ఎత్తుగడ వేసిన్నట్లు కొందరు భావిస్తున్నారు.

ఇలా ఉండగా, మాహాకూటమిలో సిపిఐకి తీరని అన్యాయం జరిగిందని ఆ పార్టీ నేత కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సీపీఐకి కాంగ్రెస్ ఏకపక్షంగా మూడు సీట్లు కేటాయించి అవమానించిందని దయ్యబట్టారు. తెలంగాణలో 40 స్థానాల్లో తాము బలంగా ఉన్నామని స్పష్టం చేసారు.

కాగా, రెండు, మూడు సీట్ల కోసం పాకులాడి చులకన కావద్దని సీపీఐకి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం హితవు పలికారు. సీపీఐ, టీజేఎస్‌ నేతలు కూటమిలో అవమానాలు భరిస్తూ సీట్ల కోసం తమ గౌరవాన్ని తాకట్టు పెట్టొద్దని హెచ్చరిస్తూ కూటమి నుంచి బయటకు వచ్చి బీఎల్‌ఎఫ్‌తో కలిస్తే అడిగినన్ని సీట్లు ఇస్తామని భరోసా ఇచ్చారు.