నామినేషన్ దాఖలు చేసిన సీఎం కేసీఆర్

గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో సీఎం తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనుకున్న సమయానికి, ముహుర్తం ప్రకారం మధ్యాహ్నం 2.34 గంటలకు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కొద్దిమంది అనుచరులతో కలిసి వచ్చిన సీఎం తన నామినేషన్‌ను అందజేశారు.

అంతకుక్రితం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఎన్నికల్లోనూ నామినేషన్‌ దాఖలు చేసే ముందు కోనాయిపల్లి వెంకన్నను కేసీఆర్‌ దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్‌ నామినేషన్‌ పత్రాలను స్వామివారి పాదాల చెంత ఉంచారు. ఆయనతో పాటు మంత్రి హరీశ్‌రావు వెంకన్నను దర్శించుకున్నారు.

అనంతరం కోనాయిపల్లి గ్రామ ప్రజలను ఉద్దేశించి కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ కష్టాలు పోయాయని, రైతులకు సరిపోయినంతగా కరెంట్‌ ఇస్తున్నామని చెప్పారు. వెంకన్న దయవల్ల వచ్చే ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందని, ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొచ్చి స్వామివారి పాదాలు కడుగుతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్దికాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించిందని చెబుతూ తాను ఎంత ఉన్నతస్థాయికి వెళ్లినా.. తన మూలాలు ఇక్కడే ఉంటాయని స్పష్టం చేసారు. స్థానిక టీఆర్ఎస్  అభ్యర్థి హరీశ్‌రావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కేసీఆర్‌ కోరారు.

1985 నుంచి ప్రతి ఎన్నిక సందర్భంగా కేసీఆర్‌ కోనాయిపల్లికి వచ్చి వెంకటేశ్వరస్వామికి పూజలు చేశాకే నామపత్రాలు దాఖలు చేస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని చేపట్టినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాకనే తెరాస ఆవిర్భావాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి ఇదే సెంటిమెంట్‌ను కేసీఆర్‌ కొనసాగిస్తున్నారు. 2004లో కేసీఆర్‌ ఇక్కడి నుంచి గెలుపొందిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికలో ఇక్కడి నుంచి పోటీ చేసిన హరీశ్‌ కూడా ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.