పెట్టుబడులకు ఇష్టమైన గమ్యంగా భారత్

పెట్టుబడులకు భారత్‌ ఇష్టమైన గమ్యంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఫైనాన్షియల్‌ టెక్నాలజీపై సింగపూర్‌ వేదికగా అతిపెద్ద కార్యక్రమం జరుగుతోంది. ఈ ఉదయం సింగపూర్‌ చేరుకున్న ప్రధాని మోదీ ఈ ‘ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌’ కార్యక్రమంలో పాల్గొంటూ భారత్‌ ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతోందని తెలిపారు.

‘సాంకేతిక పరిజ్ఞానం భారత్‌లో పాలనా విధానాలు, ప్రజా సేవల పంపిణీని మార్చేసింది. అంతేగాక సృజనాత్మకత, అవకాశాలను పెంచింది. మారుతున్న సరికొత్త ప్రపంచంలో టెక్నాలజీ అంటే పోటీతత్వంగా వర్ణిస్తున్నాం. ప్రజల జీవితాలను మార్చేందుకు సాంకేతికత ఎన్నో అవకాశాలను సృష్టిస్తోంది. బలహీన వర్గాలకు కూడా సాధికారత కల్పిస్తోంది’ అని మోదీ చెప్పారు. భారత్‌లో ఆర్థిక సేవలు అందరికీ సమానంగా అందుతున్నాయని, కేవలం కొన్ని సంవత్సరాల్లోనే 120కోట్ల మందికి పైగా ప్రజలకు బయోమెట్రిక్‌ గుర్తింపును కల్పించామని మోదీ తెలిపారు.

‘భారత్‌ విభిన్న పరిస్థితులు, సవాళ్లతో కూడిన దేశం. అందువల్ల మా విధానాలు కూడా విభిన్నంగా ఉండాలి. దేశంలో చెల్లింపు సేవలు అందరికీ ఉపయోగపడేలా ఉన్నాయి అందుకే డిజిటైజేషన్‌లో భారత్‌ విజయం సాధించింది’ అని మోదీ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా అపిక్స్‌(అప్లికేషన్‌ ప్రొగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ ఎక్స్ఛేంజ్‌)ను సింగపూర్‌ ఉప ప్రధాని షన్ముగరత్నంతో కలిసి మోదీ ప్రారంభించారు. ఈ అపిక్స్‌తో దేశీయ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక సంస్థలతో సులువుగా అనుసంధానం చేసుకోవచ్చని మోదీ తెలిపారు.

2016 నుంచి ఈ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన తొలి ప్రపంచ నేత ప్రధాని మోదీనే కావడం విశేషం. ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో ప్రసంగించడం గర్వంగా ఉందని మోదీ ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ రెండు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు.