కేరళలో 324కు పెరిగిన మృతుల సంఖ్య

కేరళలో వరదల ఉదృతి నుండి ఇప్పట్లో ప్రజలకు ఉపసమనం కలిగే పరిస్థితులు కనబడటం లేదు. గత కొద్దిరోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైంది. వరదల కారణంగా ఇప్పటి వరకు 324 మంది ప్రాణాలు కోల్పోయారని కేరళ ముఖ్యమంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్‌ వెల్లడించారు. 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు వెతెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1568 సహాయ శిబిరాలలో 52,856 కుటుంభాలకు చెందిన 2.23 లక్షల మంది ఆశ్రమం పొందుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి నిర్మల సీతరామన్ లకు ఫోన్ చేసి తాజా పరిస్థితులను ముఖ్యమంత్రి వివరించారు.

గురువారం ఒక్కరోజే వందమంది చనిపోయిన్నట్లు చెబుతున్నారు. మరోవైపు వర్షాల కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అనేక ప్రాంతాల్లో రహదారులు, భవనాలు నీటమునగడంతో రాష్ట్ర విద్యుత్‌ బోర్డు విద్యుత్‌ సరఫరాను నిలిపివేసింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు 80శాతం అంధకారంలో ఉంది.

వర్షాల ధాటికి వేలాది ఇళ్లు నేలమట్టం కాగా, రహదారులు దెబ్బతిన్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నదులు, వాగులకు వరదపోటెత్తడంతో చాలా గ్రామాలు నీటమునిగాయి.

ఎన్డీఆర్‌ఎఫ్, ఇండియన్ కోస్ట్‌గార్డ్, భారత సైన్యం, వాయుసేన దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కేరళకు అదనపు బలగాలను కేంద్రం తరలించింది.