ప్రధాని మోదీకి బాసట అంటూ సంకేతం ఇచ్చిన రజనీకాంత్ !

ప్రస్తుతం దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత బలవంతుడైన రాజకీయ నేత అని తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అభివర్ణించడం తమిళ నాడు రాజకీయాలలో ప్రకంపనాలే సృష్టిస్తున్నది. బీజేపీ ఓటమికి పలు రాజకీయ పార్టీలు చేతులు కలుపుతున్నాయని అంటూనే ఆయన బలవంతుడని వెల్లడి అవుతున్నదని అంటూ కాంగ్రెస్ ఆధర్యంలో జాతీయ స్థాయిలో `మహాకుటమి’ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలను ఎద్దేవా చేసిన్నట్లు అయింది. క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించిన రజనీకాంత్ ప్రధాని నరేంద్రమోదీ మాత్రం ఆయనను వ్యతిరేకించే పది పార్టీల కంటే బలమైన వారని చెప్పగలనని స్పష్టం చేయడం ద్వారా ప్రధానికి బాసటగా ఉండబోతున్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చిన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

`ఒక వ్యక్తికి వ్యతిరేకంగా పది మంది కూటమిని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎవరు బలమైన వ్యక్తి ? ఆ పది మంది ఒక వ్యక్తిపైన యుద్ధం ప్రకటిస్తే, ఎవరు బలమైన వ్యక్తి అని ప్రజలు నిర్ణయిస్తారని’ రజనీకాంత్ తార్కిక ధోరణిలో బదులిచ్చారు. ప్రధానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పడుతుండటంతో తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ మోదీకి దన్నుగా నిలిచినట్టు ఆయన ప్రకటన వెల్లడి చేస్తున్నది. అంతకు ముందు రోజే బిజెపి ప్రమాదకరమైన పార్టీ కావచ్చని తాను చెప్పిన్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారవేసారు. బీజేపీ ప్రమాదకరమైన పార్టీనా కాదా అనేది ప్రజలు తేల్చాలని అంశమని తెలిపారు. ప్రతిపక్షాలు బీజేపీని ప్రమాదకర పార్టీగా భావిస్తున్నాయని మాత్రమె తాను జవాబు చెప్పానని పేర్కొన్నారు.

2019 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఎన్డీయేతర పార్టీలు జట్టుకడుతున్న సమయంలో రజనీకాంత్ వాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. గతేడాది డిసెంబరు 31న రాజకీయ ప్రవేశాన్ని ఘనంగా ప్రకటించిన ఆయన అప్పటి నుండి పార్టీ ప్రారంభానికి వైపు సన్నాహాలు జరుపుకొంటున్నా ఇప్పటి వరకు నిర్దుష్టంగా ఎటువంటి ముందడుగు వేయలేదు. మరో వైపు సినీమాలను వేగంగా పూర్తిచేస్తూ వస్తున్నారు. అయితే అప్పటి నుండి రాష్ట్రంలో ఆయన ఏమి చేసినా అదో సంచలనంగా మారుతున్నది. పెద్ద చర్చకు తావిస్తోంది.

వెండితెరపై తనదైన శైలిలో మ్యానరిజం.. నటనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సూపర్‌స్టార్‌ రాజకీయాల్లోకి రావడంతో ఆయనపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటివరకు రాష్ట్రంలో బలంగా ఉన్న అన్నాడీఎంకే, డీఎంకేలలోనూ ఆందోళన మొదలైంది. వీలుచిక్కినప్పుడల్లా డీఎంకే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నది. పలు ప్రజా సమస్యలపై తనదైన రీతిలో రజనీకాంత్ స్పందిస్తున్నారు కుడా.

అయితే కాంగ్రెస్, బిజెపిల నుండి పలు పార్టీలు ఆయనకు బహిరంగ ఆహ్వానం పలికాయి. ప్రధానమంత్రి మోదీ నుంచి తమిళసై సౌందరరాజన్‌ వరకు, రాహుల్‌గాంధీ నుంచి నగ్మ వరకు రజనీకాంత్‌ను బహిరంగంగానే ఆహ్వానించారు. జయలలిత మరణం తర్వాత ఏడాది కాలంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రజనీకాంత్‌ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలరా? ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం రజనీకాంత్‌కు ఉందా..? అన్న అంశంపై చేపట్టిన ఒక సర్వేలో మెజారిటీ ప్రజలు రజనీకి మద్దతు తెలిపారని ఒక తమిళ పత్రిక కథనం ప్రచురించింది.

రాజకీయ ప్రవేశ ప్రకటన చేసినప్పటి నుంచి ఆయనను బిజెపి నడిపిస్తోందని, మోదీ కోసమే రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చారన్న విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో చెన్నై పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకంగా పోయెస్‌ గార్డెన్‌లోని రజనీ నివాసానికి వచ్చినప్పటి నుంచి ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. తర్వాత కూడా పలు సందర్భాల్లో ప్రధానిని రజనీకాంత్‌పై ప్రశంసలు కురిపించారు.

ఉదాహరణకు ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమానికి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మద్దతు పలుకుతూ ట్వీట్‌ చేశారు. పరిసరాల పరిశుభ్రత దైవభక్తికి నిదర్శనమని, అలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన మోదీకి తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అదేవిధంగా రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ పలువురు బిజెపి నేతలు బహిరంగంగా ఆహ్వానించారు.

రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకేలు యాభై సంవత్సరాలకు పైగా అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఇప్పుడు బలమైన నేతలు జయలలిత, కరుణానిధి ఇద్దరూ లేకపోవడం, రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని రాజకీయ ప్రవేశ ప్రకటన రోజున రజనీకాంత్‌ పేర్కొనడం, ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలతో అన్నాడీఎంకే, డీఎంకేకు ప్రత్యామ్నాయం తానేనన్న సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న పార్టీలలో ఎవ్వరు కూడా అన్ని సీట్లకు పోటీ చేసే పరిస్థితులలో లేకపోవడం గమనార్హం.

అయితే ఆ మేరకు ఆయన పార్టీ ప్రారంభంలో దూకుడు ప్రదర్శించక పోవడంతో జయలలిత, కరుణానిధి స్థానాలను భర్తీ చేసే నేతలం తామే అన్నట్లు పన్నీర్‌సెల్వం, పళనిస్వామి, స్టాలిన్‌, టీటీవీ దినకరన్‌, కమల్‌హాసన్‌ చాటుకునే ప్రయత్నం చేశారు. ఇటువంటి పరిస్థితులలో రజనీకాంత్ వేయబోయే అడుగులు తమిళనాట తీవ్ర ఆసక్తి కలిగిస్తున్నాయి.