మిజోరం ప్రభుత్వంలో పాగాకై బిజెపి వ్యూహాత్మక అడుగు !

మిజోరం రాష్ట్రం చిన్నదే అయినా రాజకీయాలకు కొదవలేదు. ప్రతి రాజకీయ పార్టీ రోజుకో కొత్త ఎత్తుగడలతో ప్రత్యర్థి పార్టీలకు చెమట పుట్టిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 10 లక్షలే. మొత్తం 40 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ నెల 28వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఒక్క సీట్ కుడా గెల్చుకోలేని బిజెపి ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాకుండా, ప్రభుత్వంలో భాగస్వామిగా కుడా కావడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.

ఈశాన్య రాష్ట్రాలాలలోని అన్ని రాష్ట్రాలలో కూడా ఇప్పుడు బిజెపి సొంతంగానో, భాగస్వామ్య పక్షంగానో అధికారంలో ఉన్నది. కేవలం మిజోరాంలో మాత్రమె కాంగ్రెస్ గత పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ ను అధికారం నుండి దింపడంతో పాటు, ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో భాగస్వామి కావడం కోసం బిజెపి కృషి చేస్తున్నది.

ఈ రాష్ట్రంలో క్రైస్తవ ఓటర్లు ఎక్కువ. కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్ మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ జరుగుతోంది. ఇప్పటి వరకు ఆ రెండు పార్టీలే వరుసగా అధికారాన్ని పంచుకొంటున్నాయి. ఈ రెండు పార్టీలు కూడా బీజేపీ క్రైస్తవ వ్యతిరేకి అంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి. బీజేపీ మాత్రం అభివృద్ధి, సంక్షేమ అజెండాతో దూసుకుపోతోంది. మియాన్మార్, బంగ్లాదేశ్‌ల మధ్య మిజోరం రాష్ట్రం వ్యాపించి ఉంది.

ఈ ఏడాది డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండగను బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తుందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించడంతో పార్టీ వర్గాల్లో జోష్ పెరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఓడించాలని బీజేపీ కంకణం కట్టుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 34 సీట్లు, ఎంఎన్‌ఎఫ్‌కు ఐదు సీట్లు, మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు ఒక సీటు వచ్చింది. అంతకు ముందు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 32 సీట్లు వచ్చాయి. మేఘాలయ, నాగాలాండ్‌లో క్రైస్తవుల సంఖ్య ఎక్కువ. అయినా ఇక్కడ బీజేపీ గెలిచి ఇతర పార్టీలతో కలిసి మిశ్రమప్రభుత్వ ఏర్పాటు చేసింది.

వాస్తవానికి ఎన్డీఏ కూటమిలో ఎంఎన్‌ఎఫ్ ఉంది. అయితే ఈ రాష్ట్రంలో ఎంఎన్‌ఎఫ్ సొంతంగా అన్ని సీట్లకు పోటీ చేస్తుండగా, బిజెపి తనకు తానుగా 39 సీట్లలో పోటీ చేస్తున్నది. అయితే ఈ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా ఎవ్వరికీ వారుగా పోటీ చేస్తున్నాయని, ఎన్నికల అనంతరం కలసి ప్రభుత్వం ఏర్పాటుకు లోపాయికారి ఒప్పందం పెట్టుకుందని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ బీజేపీని మతతత్వ  పార్టీగా అభివర్ణిస్తూ మిజో భాషలో 50 వేల కరపత్రాలు పంపిణీ చేసింది. తద్వారా క్రైస్తవుల ఓట్ల కోసం గాలం వేస్తున్నది. అయితే చక్మా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌తో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకోవడం గమనార్హం. ఈ కౌన్సిల్ పరిధి 1500 చ.కిమీ. ఇక్కడ గత ఏడాది 20 మందిసభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నిక జరిగింది.

ఈ ఎన్నికలలో ఎంఎన్‌ఎఫ్‌కు ఎనిమిది, కాంగ్రెస్‌కు ఆరు, బీజేపీకి ఐదు సీట్లు వచ్చాయి. విచిత్రమేమిటంటే జాతీయ స్థాయిలో బద్ధశత్రువులైన కాంగ్రెస్, బీజేపీలు కలసి కార్యనిర్వాహక కమిటీలను ఏర్పాటుచేశాయి. అనంతరం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశం మేరకు మద్దతును విరమించుకుంది.

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సంస్థను బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ సంస్థలో సభ్యుడుగా ఉన్న అస్సాం బీజేపీ నేత హిమంత బిశ్వా శర్మ , ఎంఎన్‌ఎఫ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని, కాంగ్రెస్ ఓటమికి చేతులు కలిపారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.