అధికారిక లాంఛనాలతో అనంత్‌కుమార్‌ అంత్యక్రియలు

ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో కన్నుమూసిన కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ అంత్యక్రియలు అధికారిక లాంఛనాల మధ్య మంగళవారం పూర్తయ్యాయి. బిజెపి అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ లతో సహా కేంద్ర మంత్రులు సదానంద గౌడ, రవిశంకర్‌ ప్రసాద్‌, పియూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన, విజయ్ గోయల్, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి ఎస్ యడ్డ్యూరప్ప తదితరులు అంత్యక్రియలకు హాజరై ఆయనకు తుది వీడ్కోలు పలికారు.

బిజీ షెడ్యూల్‌ ఉన్నప్పటికీ సోమవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు వెళ్లి అనంత్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు.  ఈ ఉదయం అనంత్‌కుమార్ భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి బిజెపి పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనంత్‌ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం నేషనల్‌ కళాశాల మైదానానికి తరలించారు. అక్కడి నుంచి అంతిమయాత్ర చేపట్టి చామరాజపేట్‌ శ్మశానవాటికలో అనంత్‌కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బాధపడుతున్న అనంత్‌ కుమార్‌ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. లండన్‌, న్యూయార్క్‌ వైద్యాలయాల్లో చికిత్స అనంతరం బెంగళూరుకు వచ్చిన ఆయన 20 రోజులుగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

 అనంత్‌ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పలువులు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.