భారీగా పెరగనున్న దినపత్రికల ధరలు

దినపత్రికల ధరలు  భారీగా పెరగనున్నట్లు తెలుస్తున్నది. 40 శాతంకు పైగా ధరను వచ్చే నెల మొదటి తేది నుండే పెంచనున్నట్లు చెబుతున్నారు. ఇంతకు ముందు ఆ మధ్యన నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో మూడు రూపాయిలు ఉన్న పేపర్ ను రూ.5 కు పెంచారు. ఇప్పుడు ఒకేసారి రూ 2 లేదా రూ 3కు పెంచవచ్చని తెలుస్తున్నది.

ప్రస్తుతం తెలుగు దినపత్రికలను వారంలో ఆరు రోజులు రూ.5, ఆదివారం రూ.6 చొప్పున అమ్ముతున్నారు. సెప్టెంబరు 1 నుంచి వారంలో రూ 7 లేదా రూ 8కు, ఆదివారం రూ 10కి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై దినపత్రికల యాజమాన్యాలు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చిన్నట్లు చెబుతున్నారు.

 

ఇటీవల కాలంలో పెరిగిన ఖర్చులతో పాటు, నిర్వహణ అంతకంతకూ కష్టంగా మారటంతో న్యూస్ పేపర్ల యాజమాన్యాలన్నీ కలిసికట్టుగా ధరలు పెంచాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. టన్ను రూ 30 వేలుగా ఉన్న న్యూస్ ప్రింట్ ఇప్పుడు రూ 66 వేలకు పైగా పెరిగినదని అంటున్నారు. పెరుగుతున్న డీజిల్ ధరలతో రవాణా చార్జీలు భారీగా పెరుగుతునాయి.

మరోవంక డిజిటల్ మీడియా తో పాటు సోషల్ మీడియా కుడా విశేష ప్రాచుర్యం పొందుతూ ఉండడంతో ప్రకటన దారులు వాటివైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దానితో దినపత్రికలు ప్రకటనల ద్వారా వస్తున్నా ఆదాయం గణనీయంగా తగ్గుతున్నది. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతిలతో పాటు మిగిలిన అన్ని దిన పత్రికలు తమ ధరల్ని పెంచేస్తూ నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తారని చెబుతున్నారు.

 

అయితే ఇంత భారీగా ఒకేసారి ధరలు పెంచితే సర్క్యులేషన్ మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో అని ఇప్పుడు ఆలోచనలు ఉన్నట్లు తెలిసింది. కాని ఇది ఎనికల సంవత్సరం కావడంతో దినపత్రికలు ఎక్కువగా అమ్ముడు పోయే కాలమని, ఇప్పుడు పెంచితేనే మంచి ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.  

 

న్యూస్ ప్రింట్ మీద దిగుమతి సుంకాన్ని భారీగా పెంచేయటంతో న్యూస్ పేపర్ల యాజమాన్యాల మీద భారం భారీగా మారడంతో ఆ మధ్యన పెంచి పేజీల్ని సైతం గుట్టుచప్పుడు కాకుండా తగ్గించు వేస్తున్నారు. ఆర్నెల్ల క్రితం 18 పేజీలకు తగ్గకుండా వచ్చిన తెలుగు దినపత్రికలు ఇప్పుడు రెండు నుండి నాలుగు పేజీల వరకు తగ్గుతునాయి.