తల్లీకొడుకుల ‘నిజాయతీ సర్టిఫికేట్‌’అవసరం లేదు

ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్‌పై బయటకు వచ్చిన తల్లీకొడుకుల నుంచి ‘నిజాయతీ సర్టిఫికేట్‌’ తనకు అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. పెద్దనోట్లు రద్దు చేయాలని తాము తీసుకున్న నిర్ణయం కారణంగానే డొల్ల కంపెనీల బండారం బయటపడిందని, దానివల్ల కాంగ్రెస్‌ అగ్రనేతలు (సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు) బెయిల్‌ కోరాల్సి వచ్చిందని చెప్పారు. ఆ విషయాన్ని వారెందుకు మరిచిపోతున్నారని- నేరుగా పేర్లు ప్రస్తావించకుండానే ప్రశ్నించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఆర్థిక అవకతవకలకు సంబంధించి సోనియా, రాహుల్‌లకు దిల్లీ హైకోర్టు బెయిల్‌ ఇచ్చిన విషయాన్ని పరోక్షంగా గుర్తుచేశారు.

రెండేళ్ల క్రితం తాను తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని ఆయన తోసిపుచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ... నోట్ల రద్దు నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకున్నారు.

 ‘పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ఏం ఒరిగిందో లెక్క చెప్పాలని మీరు (సోనియా, రాహుల్‌) కోరడంలో అర్థం లేదు. అనేక ఉత్తుత్తి కంపెనీలను గుర్తించడానికి ఆ నిర్ణయం దోహదపడింది. మీరు బెయిల్‌ తెచ్చుకొనేందుకు అదే కారణమయింది. బిజెపి ఉన్నదే అభివృద్ధి కోసం. కాషాయ పార్టీతో ఎలా పోటీ పడాలో విపక్షానికి అర్థం కావడం లేదంటే దానికి కారణం మాకున్న కట్టుబాటే. కాంగ్రెస్‌లో రాజకీయాలు ప్రారంభమయ్యేది, అంతమయ్యేది ఒక కుటుంబంతోనే. మా రాజకీయాలు మాత్రం పేదల గుడిసెల నుంచి ప్రారంభమవుతాయి. ఛత్తీస్‌గఢ్‌ ఇప్పటికీ కాంగ్రెస్‌ పాలనలోనే ఉన్నట్లయితే ఈ స్థాయికి వచ్చేందుకు మరో 50 ఏళ్లయినా పట్టేది’ అని చెప్పారు.

వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి గురించి దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఒక సందర్భంలో చెబుతూ- దిల్లీ నుంచి విడుదలయ్యే రూపాయిలో 15 పైసలే క్షేత్రస్థాయికి వెళ్లేదని వెల్లడించడాన్ని మోదీ ప్రస్తావించారు. ఆ మిగిలిన 85 పైసల్నీ హస్తమే కాజేసేదని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దుతో ఇప్పుడా 85 పైసలూ వెనక్కి వస్తున్నాయి. గతంలో ఇది కొంతమంది పడకల కింద, బీరువాల్లో దాగి ఉండేది. పెద్దవిలువ ఉన్న నోట్లను రద్దు చేశాక అంతా బయటకు వచ్చిందని చెప్పారు.

తమ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోడీ సమర్థించుకున్నారు. పెద్దనోట్లను రద్దు చేయడం వల్లే తక్కువ సమయంలోనే అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. దశాబ్దాల కాలంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్‌ విఫలమైందన్నారు. నోట్ల రద్దు కారణంగానే అభివృద్ధి ప్రాజెక్టులలో పురోగతి సాధ్యమైందని తెలిపారు. అభివృద్ధి ప్రాజెక్టులపై వెచ్చిస్తున్న సొమ్ము తనది కాదని, ప్రజలదని అన్నారు. అప్పటి దాక పరుపుల కింద, గోనె సంచులలో ఉన్న సొమ్ము పెద్ద నోట్ల రద్దుతో బయటకు వచ్చిందని, ఆ సొమ్ముతోనే అభివృద్ధి జరుగుతున్నదని చెప్పారు.

దేశంలో ప్రాజెక్టుల అభివృద్ధి, అవినీతి నిర్మూలనపై నెహ్రూ-గాంధీ కుటుంబాలు చాలా తక్కువగా నిధులు వెచ్చించాయని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో నిధులు కనిపించకుండా పోయాయని ఎద్దేవా చేసారు.