గంగానది మీద తొలి దేశీయ జలరవాణా వ్యవస్థ

గంగానదిపై నిర్మించిన తొలి దేశీయ జలరవాణా వ్యవస్థను తన సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సరుకు రవాణాకు సముద్ర మార్గాలు ఉన్నప్పటికీ, తొలిసారిగా దేశం లోపల జలరవాణాకు సంబంధించిన నౌకామార్గాన్ని ప్రభుత్వం గంగానదిపై ఏర్పాటు చేసింది.

వారణాసి (ఉత్తరప్రదేశ్), కోల్‌కతాలోని హల్దియా (పశ్చిమ బెంగాల్) మధ్య సరుకుల రవాణాతోపాటు ప్రజారవాణాకు ఉపయుక్తంగా ఈ పోర్టును నిర్మించారు. దేశీయ జలరవాణాను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గంగానదిపై చేపట్టిన నాలుగు జలరవాణా మార్గాల్లో ఇది మొదటిది. ప్రపంచబ్యాంక్ సహకారంతో రూ.5,369 కోట్లతో ప్రభుత్వం ఈ జలమార్గ్ వికాస్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ మేరకు అక్టోబర్ చివరివారంలో కోల్‌కతా నుంచి సరుకులతో బయల్దేరిన తొలి నౌక.. సోమవారం వారణాసికి చేరుకుంది.

లాంఛనంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ నౌకకు స్వాగతం పలికారు. ఎంవీ రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుతో ఉన్న ఈ నౌకలో మొత్తం 16 కంటెయినర్లు ఉన్నాయి. ఒక్కో కంటెయినర్ సుమారు 16 ట్రక్కులతో సమానమని అధికారులు తెలిపారు. ఈ భారీ నౌక మళ్లీ వారణాసి నుంచి ఎరువులతో తిరిగి వెళ్తుందని చెప్పారు.

1500 నుంచి రెండువేల టన్నుల వరకు సరుకుల్ని వారణాసి-హాలియా మార్గంలో ఇకపై రవాణా చేయవచ్చునని అధికారులు పేర్కొన్నారు. ఈ మార్గంలో వారణాసి-సాహిబ్‌గంజ్-హల్దియాల్లో మూడు రివర్ పోర్టు ల్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ మార్గంలోని బహుళార్ధక టెర్మినల్స్‌లో రెండు సరుకు రవాణాకు సంబందించినవి కాగా, ఐదు ప్రజారవాణాకు ఉద్దేశించిన రోల్‌ఆన్ రోల్‌ఆఫ్ (రోరో) టెర్మినల్స్ అని వారు వివరించారు. అతితక్కువ ఖర్చుతో సరుకు రవాణాకు జలమార్గాలే అత్యుత్తమమని, అందుకే ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తున్నదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.