రాజస్తాన్ లో బిజెపి తిరిగి గెలుపొందటం ఖాయం

రాజస్థాన్‌లో బిజెపికి ఎదురుగాలి వీస్తోందంటూ వెలువడుతున్న ఊహాగానాలను కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ కొట్టిపారేశారు. రాష్ట్ర ప్రజలు బిజెపికే అనుకూలంగా ఉన్నారని, ఎడారి రాష్ట్రంలో కమలం మళ్లీ వికసిస్తుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు.

రాజస్థాన్‌లో 80 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు బిజెపి ఈ సారి టికెట్లు నిరాకరించే అవకాశాలున్నట్లు గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఎదురుగాలి తప్పదని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై షెకావత్‌ను మీడియా ప్రశ్నించగా ‘రాజస్థాన్‌లో ఏ ప్రాంతంలోనైనా బిజెపిపై వ్యతిరేకత ఉందంటే నేను నమ్మను. రాష్ట్రమంతా బిజెపికి అనుకూలంగానే ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది’ అని ఆయన ధీమాగా చెప్పారు.

సామాన్యుడి జీవితంలో మార్పు తెచ్చేందుకు బిజెపి కృషి చేస్తోందని షెకావత్‌ తెలిపారు.  ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో షెకావత్‌ పోటీ చేస్తారని వస్తున్న వార్తలపై ప్రశ్నించగా ‘నాకు అలాంటి ఆలోచనేమీ లేదు. ఒకవేళ పార్టీ అలా నిర్ణయం తీసుకుంటే నేను దాన్ని అంగీకరిస్తాను’ అని చెప్పారు.

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత జాబితాను బిజెపి ఆదివారం విడుదల చేసింది. మొత్తం 200 నియోజకవర్గాలకు గానూ.. 131 స్థానాల్లో అభ్యర్థులను ఖరారుచేసింది. ఈ జాబితాలో 25 మంది కొత్తవారికి చోటుకల్పించింది. రాష్ట్రంలో డిసెంబరు 7న పోలింగ్‌ జరగనుంది.