కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు సిగ్గుచేటు : పురంధ్రీశ్వరి

రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటని భారతీయ జనతా పార్టీ జాతీయ మహిళామోర్చా ఇంచార్జి దగ్గుబాటి పురంధ్రీశ్వరి ద్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ ఒకే వేదికపై చేరాయంటే మరోసారి ద్రోహం చేయడానికే అని దుయ్యబట్టారు. ‘రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ అనైతికంగా విడగొట్టిందని తెదేపా నాయకులు అప్పట్లో విమర్శించారు. రాహుల్‌ గాంధీని రాష్ట్రంలో తిరగనివ్వబోమన్నారు. ఇప్పుడు అదే పార్టీతో కలిసి తెలంగాణలో పోటీ చేయడాన్ని ప్రజలందరూ చూస్తున్నారు’ అని ఆమె ఎద్దేవా చేసారు.

కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన మహిళామోర్చా కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విభజన అనంతరం నవ్యాంధ్రకు కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటించడమే గాక ఆర్థికంగా సాయం చేసిందని పేర్కొన్నారు.

అయినా కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. దేశంలో బీజేపీ మినహా మిగతా అన్ని రాజకీయపార్టీల్లో కుటుంబ పాలన కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. అందుకే అభివృద్ధి జరగడం లేదన్నారు. మన రాష్ట్రంలో చంద్రబాబుకు తనయుడు లోకేశ్, సోనియాకు కుమారుడు రాహుల్‌గాంధీ... ఇలా ఎన్నో రాష్ట్రాల్లో ఇదే తరహా కుటుంబ పాలన కొనసాగుతోందని వివరించారు.

ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటించినప్పుడు మోదీకి ఎవరు ఉన్నారన్న దానికి నా వెనుక 130 కోట్ల భారతీయులు ఉన్నారని చెప్పడం మనందరికి గర్వకారణమని ఆమె తెలిపారు. పేదలకు మోదీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని చెబుతూ అందులో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు.

మహిళలకు గుర్తింపునిచ్చింది ఒక్క బీజేపీయే అని ఆమె స్పష్టం చేసారు. మహిళలకు గతంలో ప్రసవం అనంతరం సెలవు 3 నెలలు ఉంటే దాన్ని 9 నెలలకు మార్చారని గుర్తు చేసారు. ఎర్రకోట ప్రసంగంలో స్వచ్ఛ్భారత్ పేరుతో ఇంటింటికి మరుగుదొడ్డి పథకాన్ని ప్రవేశపెడితే అందరూ నవ్వారని, కానీ ఈరోజు ఈ పథకం వల్ల మహిళల ఆత్మగౌరవాన్ని మోదీ నిలబెట్టారని ఆమె తెలిపారు. భాజపా 150 పథకాలను ప్రవేశపెడితే వాటిలో సగం మహిళల అభివృద్ధి కోసమేనని తెలిపారు.

భారతదేశాన్ని అగ్రభాగంలో నిలిపిన మోదీకి ప్రపంచదేశాలు అభివాదం తెలుపుతున్నాయని పేర్కొన్నారు. ఉజ్వల, జీవనజ్యోతి సంరక్షణ లాంటి పథకాలతో పాటు ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలకు మోదీ మరింత గౌరవం తీసుకువచ్చారని చెప్పారు. దీంతో ముస్లిం మహిళలు మోదీకి అండగా నిలుస్తున్నారని,  ముస్లిం మహిళల జీవితాలను కాపాడిన వ్యక్తిగా మోదీ గుర్తింపు పొందారని వివరించారు.