అనంత్‌ జీ మృతి పార్టీకి, దేశానికి తీరని లోటు

కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతితో భారతీయ జనతా పార్టీ షాక్‌కు గురైంది. ప్రధాని మోదీ సహా పలువురు బిజెపి నేతలు ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. ఇతర పార్టీల నేతలు కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆయన మృతిపై సంతాపం తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

* ప్రముఖ పార్లమెంటేరియన్‌, కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ మృతి చాలా బాధాకరం. ఇది ప్రజలకు, ముఖ్యంగా కర్ణాటక ప్రజలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను.

-రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

* నా విలువైన సహచరుడిని, స్నేహితుడిని కోల్పోయాను. చిన్న వయసులోనే ప్రజా జీవితంలోకి వచ్చి ఎంతో శ్రద్ధ, దయతో సేవ చేసిన వ్యక్తి. ఆయన చేసిన గొప్ప పనులతో ఎప్పటికీ గుర్తుంటారు. ఆయన భాజపాకు గొప్ప ఆస్తి. కర్ణాటకలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. ఆయనకు చక్కని నిర్వహణ సామర్థ్యం ఉంది. చాలా మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు.

- ప్రధాని నరేంద్ర మోదీ

* అనంత్‌ కుమార్‌ మృతి ఎంతో బాధించింది. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. త్వరలోనే కోలుకుని తిరిగి ప్రజా సేవ చేస్తారని అనుకున్నాను. ఆయన భార్య, పిల్లలకు నా ప్రగాఢ సానుభూతి.

- ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

* ఈ రోజు ఉదయం కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ జీ మరణించారన్న వార్త విచారానికి గురి చేసింది. ఆయన కుటుంబానికి, స్నేహితులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఓం శాంతి.

- కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ

* అనంత్‌ జీ మృతి బిజెపికి, భారత రాజకీయాలకు తీరని లోటు. ఇప్పట్లో ఆ లోటు భర్తీ కాదు. ఆయన వివిధ మంత్రిత్వ శాఖలను ఎంతో చక్కగా నిర్వహించారు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు ఈ విషాదాన్ని తట్టుకునే బలాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.

-బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా

* అనంత్‌ కుమార్‌ మృతి పార్టీకి, వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఆయన మాకు గొప్ప స్నేహితుడు, చక్కని మార్గదర్శకులు కూడా. కర్ణాటక ఎన్నికల్లో కలిసి పనిచేశాం. ఆయన ఆకస్మిక మృతి షాక్‌ కలిగించింది. బెంగళూరులో జరిగే ఆయన అంతిమయాత్రలో పాల్గొంటున్నాం.

-కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌

* ఇది షాకింగ్‌ ఘటన. అనంత్‌ జీ మృతి పార్టీకి, ప్రభుత్వానికి తీరని నష్టం. గొప్ప అడ్మినిస్ట్రేటర్‌గా, ప్రముఖ నేతగా ఆయన ఎప్పటికీ గుర్తుంటారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున నివాళులర్పిస్తున్నాం.

- యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌

* అనంత్‌ జీ మృతి ఎంతో బాధ కలిగించింది. ఆయన మాకు చక్కని మార్గదర్శకులు. ఇలాంటి విషాద సమయంలో ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాను.

- కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

* అనంత్‌ కుమార్‌ జీ చాలా కష్టపడే తత్వం గల రాజకీయ నాయకుడు. సామాజిక కార్యకర్త. కర్ణాటక రాజకీయాల కోసం ఎంతో చేశారు. ఆయన మృతి ఎంతో బాధ కలిగిస్తోంది.

- బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌

* అనంత్‌కుమార్‌ జీ ఇక మనతో లేరు అని తెలిసి చాలా బాధ కలిగింది. దేశంలో, కర్ణాటకలో బిజెపి కోసం ఆయన ఎంతో చేశారు. బెంగళూరు ఎప్పుడూ ఆయన మనసులోనే ఉంటుంది. ఇంతటి విషాదాన్నితట్టుకోగలిగే బలాన్ని దేవుడు ఆయన కుటుంబానికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నా.

- కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌

* సీనియర్‌ సహచరుడు, స్నేహితుడిని కోల్పోయా. అనంత్‌ కుమార్‌ జీ మృతి గురించి తెలిసి షాక్‌కు గురయ్యా. ఎంతో బాధ కలిగింది. ప్రజా సంక్షేమం కోసం ఆయన పడే తపన, శ్రద్ధ ప్రశంసించదగినవి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం.

- కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

* అనంత్‌ కుమార్‌ విలువలకు ప్రాధాన్యమిచ్చే రాజకీయ నాయకుడు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన, ఆయన మద్దతుదారులు చేసే పనులతో బెంగళూరు ప్రజలకు ఇష్టమైన నేతగా మారారు. ఆయన మృతి విచారకరం.

- కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి

అనంత్‌ కుమార్‌ మృతితో కర్ణాటకలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. నవంబరు 14 వరకు సంతాపం దినాలుగా ప్రకటించడమే కాకుండా, సోమవారం సెలవు ఇచ్చారు. ఆయన అంతిమ సంస్కారాలు పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయని కేంద్ర హోం శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని అవనతం చేయాలని సూచించింది.