ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి రెచ్చిపోయిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్రంలో నేడు తొలిదశ పోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే పోలింగ్‌ ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందే మావోయిస్టులు బాంబు దాడికి దిగారు. దంతెవాడ జిల్లాలోని తుమక్‌పాల్‌-నయనార్‌ రోడ్డుపై ఈ ఉదయం 5.30గంటల ప్రాంతంలో నక్సల్స్‌ ఐఈడీని పేల్చేశారు. పోలింగ్‌ విధుల నిమిత్తం వెళ్తున్న భద్రతాసిబ్బంది, ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు.

అయితే ఈ ఘటనలో భద్రతాసిబ్బంది, ఎన్నికల అధికారులకు ఎలాంటి హానీ జరగలేదని, వారంతా సురక్షితంగా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆదివారం కూడా మావోయిస్టులు బాంబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల దృష్ట్యా గాలింపు చర్యలకు వెళ్లిన భద్రతాసిబ్బందిపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. కాంకేర్‌ జిల్లాలో ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో ఓ ఎస్సై ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు అత్యంత భద్రత నడుమ తొలి దశ పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 90 స్థానాలున్న శాసనసభలో మొదటిదశలో బీజాపూర్‌, నారాయణ్‌పూర్‌, కాంకేర్‌, బస్తార్‌, సుక్మా, రాజనందగావ్‌, దంతెవాడ జిల్లాలోని 18 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న 10 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది. మిగతా 8 చోట్ల ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.

18 నియోజకవర్గాల్లో మొత్తం 190 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌, రాష్ట్ర మంత్రులు కేదార్‌ కశ్యప్‌, మహేశ్‌ గగ్దా, ఎంపీ విక్రమ్‌ ఉసెందీ ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక మిగతా 72 స్థానాలకు ఈ నెల 20న పోలింగ్‌ జరగనుంది. డిసెంబరు 11న ఫలితాలు వెలువడుతాయి.

ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్‌

ఛత్తీస్‌గఢ్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు  గనారామ్‌ సాహూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు. తొలి దశ ఎన్నికల ముందు సాహూ పార్టీని వీడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ ఎంతో కీలకంగా భావిస్తున్న ఈ ఎన్నికల ముందు పార్టీ ముఖ్య నేత రాజీనామా చేయడంతో నేతలు ఆందోళన చెందుతున్నారు.

 రాజీనామాకు సరైన కారణమేమీ తెలపకపోయినా ఆయన కోరుకున్న దుర్గ్‌ సిటీ సీటు విషయంలో పార్టీ ఆయనకు మద్దతుగా నిలవలేదన్న​ నిరాశతో రాజీనామా చేశారని పార్టీ నేతలు భావిస్తున్నారు.

తుది దశ పోలింగ్‌ జరుగుతున్న 18 స్థానలలో కాంగ్రెస్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాలు 12 ఉన్నాయి. గత పదిహేళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్‌ ఈసారి ఎలానైనా అధికారం చేజికిచ్చుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుండగా నాలుగోసారి కూడా తమదే విజయమని సీఎం రమణ్‌సింగ్‌ ధీమాతో ఉన్నారు.

ఇవి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో లక్ష మంది సాయుధులతో గట్టి బద్రతా ఏర్పాట్లు చేసారు. ద్రోన్లతో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసారు. అన్ని ప్రధాన రహదారులపై నిఘా ఉంచారు. ఆటవీ ప్రాంతాలలో సోదాలు చేసారు.