కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ కన్నుమూత

కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్‌ నేత అనంత్‌కుమార్ (59) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని శ్రీశంకర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. తెల్లవారుజామున 2 గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

కొద్దిరోజుల క్రితం ఆయన అమెరికాలో చికిత్స పొందారు. న్యూయార్క్‌లోకి క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొంది గత నెల బెంగళూరు వచ్చారు. అనంతరం శ్రీశంకర ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు. కేంద్ర మంత్రి పార్థివదేహాన్ని బెంగళూరులోని నేషనల్‌ కాలేజీలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.

1959 జూలై 22న జన్మించిన అనంత్‌కుమార్‌ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఏబీవీపీలో కీలక పాత్ర పోషించారు. 1996 నుంచి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు. 2014లో మోదీ మంత్రివర్గంలో ఎరువులు, రసాయన శాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వాజ్‌పేయీ హయాంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన మొత్తం ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

కేంద్ర మంత్రి అనంతకుమార్‌ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతాపం తెలిపారు. ఆయన మృతి దేశ ప్రజలకు, ముఖ్యంగా కర్ణాటక ప్రజలకు తీరనిలోటని తెలిపారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  

అనంతకుమార్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విలువైన సహచరుడిని కోల్పోయానని చెబుతూ యువకుడిగా ప్రజా జీవితంలో అడుగుపెట్టిన ఆయన ఎంతో సేవ చేశారని తెలిపారు. అనంత్‌కుమార్‌ చేసిన మంచి పనులు ఆయనను చిరకాలం గుర్తుంచుకునేలా చేస్తాయని పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ బలోపేతానికి ఆయన చాలా కష్టపడ్డారని కొనియాడారు. అనంత్‌కుమార్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ.. ఆయన భార్యను ఫోన్‌లో పరామర్శించారు. 

అనంత్‌కుమార్‌ మృతి షాక్‌ గురిచేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పేర్కొన్నారు. ఎంతో నిబద్ధతతో ఆయన దేశానికి సేవ చేశారని కొనియాడారు. కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేయడానికి ఆయన అహర్నిశలు శ్రమించాడని అన్నారు. అనంత్‌కుమార్‌ కుటుంబానికి, సహచరులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి శక్తిని ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలాసీతారామన్‌ తదితరులు అనంతకుమార్‌ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతకుమార్‌ మృతిపట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపం ప్రకటించారు.