ఛత్తీస్‌గఢ్‌ లో కాంగ్రెస్ కు తీవ్ర నష్టం తప్పదు

రాజకీయాల్లోకి రావడానికి ముందు ఆయుర్వేద వైద్యుడిగా సుపరిచితుడైన రమణ్‌సింగ్‌ 15 సంవత్సరాలుగా సచ్ఛీలుడైన ముఖ్యమంత్రిగా, సమర్థుడైన పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నారు. మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలని పట్టుదలగా ఉన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో మునుపెన్నడూ లేనట్లుగా ఈ దఫా ముక్కోణపు పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ నుంచి విడిపోయిన అజిత్‌జోగి జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జేసీసీ) పేరుతో పార్టీ పెట్టారు. బీఎస్పీ, సీపీఐలతో పొత్తు పెట్టుకుని మూడో కూటమిగా అవతరించారు. జేసీసీ-బీఎస్పీ-సీపీఐల పొత్తు వల్ల బిజెపి, కాంగ్రెస్‌లపై ప్రభావం ఉంటుందని అంగీకరించిన రమణ్‌సింగ్‌.. కాంగ్రెస్‌కు మాత్రం తీవ్రస్థాయిలో నష్టం తప్పదని ‘ఈనాడు’కు ఇచ్చిన ముఖాముఖిలో పునరుద్ఘాటించారు.

అధికారంలో 15 ఏళ్లుగా ఉంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఎలా ఎదుర్కొంటారు?

2008, 2013ల్లో కూడా ఈ ప్రశ్న ఎదురైంది. అప్పుడు, ఇప్పుడు కూడా అసహనంలో మునిగిపోయిన ప్రతిపక్షం సృష్టించిన ప్రభుత్వ వ్యతిరేకత ఇది. ఇదో అంశమే కాదు. వారు అధికారం లేకపోవడంతో నిరాశలో ఉన్నారు. మా అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయి.

మీరు 16 మంది శాసనసభ్యులకు టికెట్లు నిరాకరించడానికి ప్రభుత్వ వ్యతిరేకతే కారణమా?

ఎమ్మెల్యేల పనితీరు బాగోలేని కొన్ని స్థానాల్లో మాత్రమే కొత్తవారికి అవకాశమిచ్చాం. పనితీరు బాగున్న చాలా మందికి మళ్లీ అవకాశం కల్పించాం.

బిజెపి గిరిజనుల శత్రువని మావోయిస్టులు అంటున్నారు. ఈ దఫా పరిస్థితి మారుతుందా?


ఈ దఫా కచ్చితంగా ఈ సంఖ్య మారుతుంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టడం వల్ల గిరిజనుల్లో ప్రభుత్వం పట్ల ఆదరణ పెరుగుతోందని మావోయిస్టులు భయపడుతున్నారు. అక్కడి గిరిజనులు బహిరంగంగా భాజపాను ప్రశంసించడానికి భయపడొచ్చునుగాక.. అభివృద్ధి పనులను కొనసాగించడానికి మాత్రం మాకే ఓటేస్తారన్న నమ్మకం ఉంది. నక్సలిజం అనేది కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ ప్రేరేపిత అజెండా అని గిరిజనులకు తెలుసు.

15 ఏళ్లుగా అధికారంలో లేని కాంగ్రెస్‌ పార్టీని నక్సలిజం విషయంలో మీరెలా తప్పుబడతారు?

నక్సలిజం అనేది విప్లవమని, మావోయిస్టులు ఆ పనిలో ఉన్నారని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు ఇటీవల పేర్కొన్నారు. తుపాకులకు బదులు అభివృద్ధితో విప్లవం తీసుకురావాలని భాజపా బలంగా నమ్ముతోంది. 15ఏళ్లుగా రాష్ట్రంలో చేసిందిదే.

అయినప్పటికీ మావోయిస్టుల సమస్య కొనసాగుతోంది కదా?

మావోయిస్టుల సమస్య కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదని పునరుద్ఘాటిస్తున్నాను. శత్రువుతో ఎదురెదురుగా పోరాడడం అనేది సరిహద్దులో మాత్రమే సులభం. లేదా ముఠానాయకులకు మాత్రమే సులువైన పని. ఎందుకంటే ఈ రెండు సందర్భాల్లో విచక్షణా రహితంగా కాల్పులు జరపగలం. మావోయిస్టులు ఫలానా ప్రాంతంలో మాత్రమే దాగున్నారని పోలీసులకు తెలిసినా వారందరిపై దాడి చేయలేరు. ఎందుకంటే అక్కడ సాధారణ పౌరులూ ఉండొచ్చు. మావోయిస్టులు వారిని రక్షణ కవచంగా వాడుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో మావోయిస్టులను, పౌరులను వేరు చేయడానికి మార్గం లేదు. ఇదే అతిపెద్ద సవాలు. ఈ సవాలును అధిగమించడానికి మేం అనేక స్థాయుల్లో కృషి చేస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఝార్ఖండ్‌, మహారాష్ట్రల్లో మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయి. కానీ, ఛత్తీస్‌గఢ్‌లో ఆ పరిస్థితి కనిపించడం లేదు?

ఛత్తీస్‌గఢ్‌ మొదటి నుంచి మావోయిస్టుల కార్యకలాపాలకు కేంద్రం. ఇక్కడే అంతర్రాష్ట్ర కార్యకలాపాలు సాగేవి. ఇక్కడ నుంచే ఇతర రాష్ట్రాల్లో దాడులకు తెగబడేవారు. 40వేల చదరపు కిలోమీటర్ల సంక్లిష్టమైన భూభాగం ఉందిక్కడ. మేం అత్యంత తీవ్రస్థాయిలో పోరాడుతున్నాం. రహదారులు, వంతెనలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించడంలో విజయం సాధించాం. ప్రస్తుతం మావోయిస్టులు ఇక్కడ ఓటమి ముంగిట పోరాడుతున్నారు. మేం మళ్లీ అధికారంలోకి వచ్చాక మిగిలిన సమస్యలను అభివృధ్ధితో అధిగమిస్తాం. అభివృద్ధి మార్గంతోనే మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించగలం.

ఎన్నికల్లో ద్వైపాక్షిక పోరుసాగే రాష్ట్రంకాస్తా.. అజిత్‌ జోగి, బీఎస్పీ, సీపీఐలు జట్టుకట్టడంతో ముక్కోణపు పోరు జరిగే రాష్ట్రంగా మారింది కదా?

జోగి, మాయావతి, సీపీఐ కూటమి ఓట్లను చీల్చుతుందనడంలో సందేహం లేదు. ఈ కూటమి వల్ల మాకంటే కాంగ్రెస్‌ పార్టీకే ఎక్కువ నష్టం.

జోగి కూటమి వల్ల జనరల్‌ స్థానాల్లో కాంగ్రెస్‌కు, ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో బిజెపికి నష్టం చేకూరుతుందని అంచనాలు ఉన్నాయి కదా?

దీనర్థం దళితులు బిజెపికి ఓటు వేయలేదని కాదు. మా ప్రభుత్వ విధానాల వల్ల భాజపాకు దళితుల హృదయాల్లో చోటు లభించింది. 2013లో 10 ఎస్సీ స్థానాల్లో తొమ్మిది చోట్ల బిజెపి  గెలిచింది కదా. బిలాస్‌పూర్‌ చుట్టపక్కల ప్రాంతాల్లోని కొన్నిస్థానాల్లో అజిత్‌జోగి ప్రభావం చూపొచ్చు. ఆయన కూటమి మైదానం వెలుపల ఉండే ఆటగాడిగా రాష్ట్రస్థాయిలో మిగిలిపోతుంది. గిరిజనులు బిజెపినే ఎన్నుకుంటారని నమ్మకం ఉంది. మా పోరాటం కచ్చితంగా కాంగ్రెస్‌పైనే.