టీఆర్‌ఎస్ వస్తే నిజాం పరిపాలన.. మహాకూటమి వస్తే యేసు పాలన

నాలుగున్నరేళ్ల పరిపాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో వైఫల్యం చెందిందని, రైతు ఆత్మహత్యల్లో, అవినీతిలో తెలంగాణను దేశంలో రెండోస్థానంలో నిలిపిందని శ్రీపీఠం అధిపతి, బిజెపి నేత పరిపూర్ణానంద విమర్శించారు. టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే నిజాం పరిపాలన, మహాకూటమి వస్తే యేసు పాలన వస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయాల ప్రక్షాళన కోసమే తాను ఈ రంగంలోకి వచ్చానని ఆయన వెల్లడించారు. తాను పోటీచేయాలా? పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాలా? అన్న విషయం జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు ఉంటుందని ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన స్పష్టంచేశారు.

చాలాకాలంగా ధార్మిక ప్రచారంలో ఉన్న మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణాలేంటి?

రాజకీయం ఓ ప్రభావవంతమైన వేదిక. అందుకే ఇందులోకి అడుగుపెట్టా. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ స్వార్థం, రాగద్వేషాలు, అహంకారంతో నడుస్తోంది. దానిని ప్రక్షాళన చేయాలి. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లకు ప్రాతిపదికేంటి? బీసీల పొట్టకొడితే వారు రోడ్డున పడాల్సిందేనా? అధికారంలోకి వస్తే ఏసు పాలన తెస్తామని కాంగ్రెస్‌ అంటోంది. నిజామే తెలంగాణ చరిత్రని, నిజాం పాలన అందిస్తామని కేసీఆర్‌ అంటున్నారు. భాజపా దేశంలో ఉన్న ప్రజలందరి బాధ్యత తీసుకుంది. ఏనాడూ మతప్రాతిపదికన రాజకీయాలు చేయలేదు. అందుకే భాజపా సరైన వేదిక అనుకుని చేరా. రాజకీయాల్లోకి వచ్చినా ధార్మిక ప్రచారాన్ని విడిచిపెట్టను.

బిజెపి అభ్యర్థుల తరఫున ప్రచారం మొదలుపెట్టారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది?
రాజకీయం అంటే అడ్డగోలుగా దోచుకోవడం.. దాచుకోవడం అన్నట్లుగా మారింది. సామాన్య ప్రజలు ఎవరికి ఓటేసినా ఒక్కటేనన్న భావనతో విసుగెత్తిపోయారు. ఈ పరిస్థితిని మార్చాలి. నా ఆలోచనల్ని పార్టీతో పంచుకున్నా. నన్ను ప్రచారానికి దింపారు. ‘ఒక్క రూపాయి అవినీతికి పాల్పడను. హామీల అమలుకు కట్టుబడతా. అభివృద్ధి పనులు, పథకాల అమలులో జాప్యం లేకుండా సేవలు అందిస్తా..’ అని అభ్యర్థులతో ప్రమాణం చేయిస్తున్నా. ఓటెందుకు వేయాలి అనుకున్నవారు సైతం.. స్వామి వచ్చారంటూ కొత్తగా ఆలోచిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో పోటీచేస్తారా?
పార్టీ నాయకత్వం చెబితే.. తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా పోటీకి సిద్ధం. నామినేషన్లకు 19 వరకు సమయం ఉంది. నా పోటీపై ఇప్పటివరకు సంకేతాలు రాలేదు. రెండుచోట్ల చేయమన్నా చేస్తా.

ఓవైపు అధికార తెరాస.. మరోవైపు మహాకూటమి.. ఇలాంటి బలమైన ప్రత్యర్థుల్ని బిజెపి ఎంతమేరకు ఎదుర్కుంటుంది?
మేం ప్రత్యేక వ్యూహాలు రూపొందించుకుంటున్నాం. ‘నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్‌ఎస్ అన్ని రంగాల్లో విఫలమైంది. రైతుల ఆత్మహత్యల్లో, అవినీతిలో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో ఉంది. ఈ ప్రభుత్వానికి విచక్షణ లేదు. వివక్ష చూపుతోంది. అందుకే టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు నిలదీస్తున్నారు. రోజుకు 10 నియోజకవర్గాల నుంచి ఇలాంటి వీడియోలు వస్తున్నాయి. మహాకూటమి.. వారికే అర్థం కాకుండా పొత్తులతో సతమతం అవుతోంది. 2009లో కేసీఆర్‌, చంద్రబాబు జట్టు కట్టిన మహాకూటమి ఓటమిపాలైంది. 2014లో టిడిపి-బిజెపి కలిసినా ఓటమి తప్పలేదు. 2019 చంద్రబాబు-కాంగ్రెస్‌.. టిడిపికి మూడోసారి ఓటమి తప్పదు.

మీ ప్రసంగాలు రెచ్చగొట్టేలా, మతపరమైన విభజన తెచ్చేలా ఉంటాయని.. మజ్లిస్‌, రజాకార్ల గురించి   పదేపదే ప్రస్తావిస్తారన్న విమర్శలపై ఏంటారు?

రజాకార్లు, మజ్లిస్‌ గురించి నేనేం కొత్తగా చెప్పలేదు. రెచ్చగొట్టి మాట్లాడలేదు. చరిత్రను వక్రీకరించలేదు. ‘నిజాం పిశాచమా?’ అని దాశరథి తిట్టారు. అలాగని దాశరథి రెచ్చగొట్టారని అనగలమా? ఏ మతాన్ని కూడా నేను ఇప్పటివరకు కించపరచలేదు. నా వెనుక ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఉన్నారు. వారు నన్ను అభిమానిస్తారు.

టీఆర్‌ఎస్ నాలుగున్నరేళ్ల పాలనపై మీ అభిప్రాయం ఏంటి?
టీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి ప్రత్యేకంగా ఏముంది? మెట్రో రైలు కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా వచ్చిందా? లక్ష పైచిలుకు ఉద్యోగాల భర్తీ అన్నారు. ఎక్కడ? రైతుబంధుతో బడాబాబుల జేబులు నింపారు. రూ. 6,800 కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలున్నాయి. ఉజ్వల గ్యాస్‌ పథకాన్ని అమలు చేయలేదు. కేసీఆర్‌ కిట్‌లో రూ.6 వేలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది. రూపాయి కిలో బియ్యానికి కేంద్రం రూ. 29 సబ్సిడీ ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వమిచ్చేది రూ.రెండే. కేంద్రంలో మళ్లీ భాజపా ప్రభుత్వం ఖాయం. తెలంగాణలోనూ గెలిపిస్తే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి.. తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేస్తాం.

హైదరాబాద్‌ నుంచి మిమ్మల్ని బహిష్కరించడానికి  కారణాలేంటి?
మతప్రాతిపదికన 12% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నేను గళమెత్తా. అది ముఖ్యమంత్రికి నచ్చలేదు. సీఎం మంచి చేసినప్పుడు మంచి అన్నందుకు నాకు నమస్కరించారు. అప్పుడు నేనేం పొంగిపోలేదు. ఇది తప్పు అన్నప్పుడు నన్ను బహిష్కరించారు. అప్పుడు నేను కుంగిపోలేదు.

ఒక మతం గురించి ప్రచారం చేసేవాళ్లు రాజకీయాల్లోకి రావడం వల్ల మతసామరస్యంపై ప్రభావం పడుతుందన్న అభిప్రాయాలపై ఏమంటారు?


ఒక మతం మంచిదని చెప్పుకుంటే మరో మతాన్ని తిట్టినట్లు కాదు. నేను ఏ స్థానంలో ఉన్నా నా ధర్మాన్ని విడిచిపెట్టను. ఇదే కాషాయం ధరిస్తా. రాజకీయాల్లోకి వచ్చాను. నాయకుడిని కాబట్టి ఇతర మతాల పండగలకు వారి టోపీలు పెట్టుకునే వేషాన్ని నేను వేయను. కానీ ఆ మతం వారిని గౌరవిస్తాను. దీనివల్ల అవతలివారికి నా పట్ల గౌరవం పెరిగేలా ప్రవర్తిస్తా. మతసామరస్యంపై ప్రభావం పడదు.

బిజెపి లక్ష్యం 70 నియోజకవర్గాలని చెబుతున్నారు. సగానికిపైగా స్థానాల్లో మీ పార్టీకి సరైన అభ్యర్థులే లేరు కదా?
బిజెపికి అభ్యర్థుల సమస్య లేదు. ఇప్పటికే 66 ప్రకటించాం. మహాకూటమి అభ్యర్థులు ఎవరో ఇప్పటివరకు తెలియదు. కూటమిలో అలకలు పడుతున్నారు. పిలకలు పట్టుకుంటున్నారు. ఇవన్ని తేలేది ఎప్పటికో మరి!