బి-ఫారాలను అందజేసిన కేసీఆర్‌

తెలంగాణలో టీఆర్‌ఎస్ తరపున బరిలోకి దిగనున్న 107 మంది అభ్యర్థులకు పార్టీ అధినేత, ముఖ్యమంతిర్ కే చంద్రశేఖరరావు బి-ఫారాలను అందజేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో అభ్యర్థులతో కేసీఆర్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని వారికి తెలిపారు. అంతకు ముందు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గజ్వేల్‌ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్‌ పాల్గొన్నారు.

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గజ్వేల్‌ నియోజకవర్గానికి ఇప్పటి వరకూ తాను చేసింది కొంతేనని పేర్కొన్నారు. ఈ నెల 14న నామినేషన్‌ వేస్తున్నానని.. నామినేషన్‌ రోజున ఎవరూ రావొద్దని కేసీఆర్‌ సూచించారు. ఈ నెల 15 నుంచి ప్రచార సభల్లో పాల్గొంటానని తెలిపారు.

గజ్వేల్‌ ప్రజలు తనను మళ్లీ గెలిపిస్తారని.. అందులో ఎలాంటి సందేహం లేదని కెసిఆర్ భరోసా వ్యక్తం చేసారు. గజ్వేల్‌ నియోజకవర్గానికి ఇప్పటి వరకూ తాను చేసింది కొంతేనని పేర్కొన్నారు. తొలి విడతలో రాష్ట్రం కోసం పూర్తి సమయం కేటాయించానని.. ఈసారి గజ్వేల్‌ కోసం కూడా కొంత సమయం కేటాయిస్తానని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో గజ్వేల్‌ నియోజకవర్గంలో ఏ ఒక్కరూ ఇళ్లు లేకుండా ఉండకూడదని కేసీఆర్‌ స్పష్టం చేసారు.  ప్రతిపల్లెకు తారు రోడ్డు వేస్తామని.. ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి గుంటకు సాగునీరు అందిస్తామని చెప్పారు.

వచ్చే వర్షాకాలం నాటికి కొండపోచమ్మ జలాశయాన్ని నింపుతామని వెల్లడించారు. గజ్వేల్‌లో మూడు పంటలు పండించే స్థాయికి రైతులు ఎదగాలని కోరారు. తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో ఆహార శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని.. మొదటి దశలో గజ్వేల్‌ నియోజకవర్గానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పంట కాలనీలు కూడా మొదట గజ్వేల్‌లోనే రావాలని పేర్కొన్నారు. గజ్వేల్‌లో ప్రతి ఇంటికి వందశాతం రాయితీతో రెండు పాడి పశువులను ఇస్తామని హామీ ఇచ్చారు.

తాను తీసుకొచ్చిన 75 శాతం పథకాలు ఈ వ్యవసాయ క్షేత్రంలోనే పుట్టినవేనని గుర్తుచేశారు. కంటివెలుగు పథకానికి ఎర్రవల్లిలోనే నాందిపడిందని చెప్పారు. గజ్వేల్‌ రాష్ట్రానికే ఆదర్శంగా ఎదగాలని ఆకాంక్షించారు. పాత సంప్రదాయ ప్రభుత్వాల ఇనుప గోడలను బద్దలుకొట్టి పథకాలను తీసుకొచ్చామని వివరించారు.